ఎమ్మెల్సీల ఎంపికపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26 : గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ… గవర్నర్ కోటా కింద గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళి సై తిరస్కరించారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీల్లో కోదండరామ్‌ను ఎలా అమోదించారని ప్రశ్నించారు.
దాసోజు శ్రవణ్.. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడారని..కుర్ర సత్యనారాయణ ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రకటించిన ఆ ఇద్దరు నేతలకు రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని గవర్నర్ చెప్పారని.. ఇప్పుడేమో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరామ్‌ను గవర్నర్ ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దాసోజ్ శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణలకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరామ్‌కు ఎలాంటి అడ్డంకి ఉండదా..అని కేటీఆర్ ప్రశ్నించారు.