బిఆర్‌ఎస్‌ పాలనలో గజ్వేల్‌ ఎంతో అభివృద్ధి

ఈ విజయం మీది…మీ అందరి కష్టం…
ఏ కష్టం వొచ్చినా రండి..కంటికి రెప్పలా కాపాడుకుంటా
గజ్వేల్‌ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్‌ రావు  

గజ్వేల్‌, ప్రజాతంత్ర, జనవరి 18 : గజ్వేల్‌లో కెసిఆర్‌ను ఓడిరచేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని, అయినా ఎంతో అద్భుతంగా పని చేసి కెసిఆర్‌ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేశారని, బిఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం తెలియచేస్తున్నానని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్‌ రావు అన్నారు. గురువారం జరిగిన గజ్వేల్‌ కృతజ్ఞత సభలో హరీష్‌ రావు మాట్లాడుతూ..ఈ విజయం మీది. మీ అందరి కష్టం. మీకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు.  కేసీఆర్‌ పై 154 నామినేషన్లు వేశారు. అనేక కుట్రలు. విత్‌ డ్రా తర్వాత 47 మిగిలాయి. నాలుగు మిషన్ల ఏర్పాటు వల్ల కొందరు కన్ఫ్యూజ్‌ అయ్యారు. 18,750 ఓట్లు చితికిపోయాయి. మరో 2200 వోట్లు కారును పోలిన రోడ్డు రోలర్‌ గుర్తుకు పడ్డాయి. ఇన్ని కుట్రలు జరిగినా కెసిఆర్‌ 45 వేల మెజారిటీతో గెలిపించారు. మూడోసారి గెలుపు అందించారు. గజ్వేల్‌ ప్రజలందరికీ కేసీఆర్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ తరుపున ధన్యవాదాలు. గజ్వేల్‌లో ఎంతో అభివృద్ధి జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీలో గజ్వేల్‌పై అక్కసు వెళ్లగక్కింది కాంగ్రెస్‌. కేసీఆర్‌ ఇక్కడకు వొచ్చాక తాగు, సాగు నీటి సమస్య లేదు. కేసులు తగ్గాయి. కుట్రలు తగ్గాయి. గత చరిత్రను తిరగ రాసింది బిఆర్‌ఎస్‌.  ఒక్కనాడు కూడా కాంగ్రెస్‌ నాయకులపై కేసుకు పెట్టలేదు. గజ్వేల్‌ ఎలా బాగు చేయాలి అని నిరంతరం ఆలోచించారు. కానీ కాంగ్రెస్‌ వాళ్ళు వొచ్చి నెల రోజులు కాలేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేసులు పెడుతున్నరు. కెసిఆర్‌ గజ్వేల్‌ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తే, కాంగ్రెస్‌ వాళ్లు కేసులు, కుట్రలతో ముందుకు తీసుకెళుతున్నారు. డిసెంబర్‌ 9 న రుణమాఫీ అన్నారు, 4 వేలకు పించన్లు పెంచుతాం అన్నారు, కరెంట్‌ బిల్లు కట్టొద్దు అన్నారు. రైతు బంధు పెంచుతాం అన్నారు, వడ్లకు 500 బోనస్‌ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నరు.

ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నరు. ప్రగతి భవన్‌లో 250 బెడ్‌ రూమ్‌లు అన్నారు, బంగారు బాత్‌ రూములు ఉన్నాయన్నారు. అక్కడ ఉంటున్న భట్టి వాస్తవాలు చెప్పాలి. కేటీఆర్‌ దావోస్‌ వెళ్లి పెట్టుబడులు తెస్తే దండుగ అన్నారు. ఉత్తకుమార్‌ రెడ్డి అక్కడికి వెళ్ళడం వేస్ట్‌ అన్నారు. మీ ముఖ్యమంత్రి వెళ్ళారు ఏం సమాధానం చెబుతారు. బిజెపితో కోట్లాడతమని దోస్తీ చేస్తున్నది ఎవరు. బండి సంజయ్‌, అరవింద్‌, ఈటల రాజేందర్‌, రఘునందన్‌ను ఓడగొట్టింది బిఆర్‌ఎస్‌ పార్టీ. ఈ దేశం ఆదానీ అంబానీ చేతుల్లో ఉందని, ఆదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నడని, ఈ ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలు ఉన్నయని రాహుల్‌ గాంధీ అంటడు. సాయంత్రం రేవంత్‌ రెడ్డి, ఆదాని కలిసి హగ్‌ ఇచుకుంటరు. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుంటరు. రాహుల్‌ కరెక్టా, రేవంత్‌ కరెక్టా..పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమంటే బిజెపిపై కాంగ్రెస్‌ వాళ్లు ఎందుకు కొట్లాడం లేదు. మెడలు వంచుతామని చెప్పిన కాంగ్రెస్‌ వాళ్లు, బిజెపి కేంద్ర మంత్రుల మెడలో నేడు పూలదండలు వేస్తున్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలంగాణ ప్రజలకు స్పష్టం అర్థమవుతున్నది. గజ్వేల్‌ ప్రజల కోసం నా తలుపులు 24 గంటల పాటు తెరిచే ఉంటాయి. ఎవరికి ఏ కష్టం వొచ్చినా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎక్కడ అన్యాయం జరిగినా ఫోన్‌ చేయండి, నేనే మీ వద్దకు వస్తాను భుజం కలిపి పోరాటం చేస్తాను. పోరాటాలు మనకు కొత్త కాదు. నేను అరెస్టు కానీ పోలీస్‌ చేసేనే లేదు తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో హైదరాబాదులో నన్ను పెట్టని పోలీస్‌ స్టేషన్‌ ఏ లేదు. పోలీస్‌ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. ఉద్యమ సమయంలో అరెస్టై మెదక్‌ జైల్లో నాలుగు రోజుల పాటు ఉన్నాను. ధైర్యంగా ఉండండి, టిఆర్‌ఎస్‌ పార్టీ మీకు అండగా ఉంటుంది. గజ్వేల్‌ లో కేసీఆర్‌ మంజూరు చేసిన పనులను ఆపడం ఇదెక్కడి పద్ధతి. మీకు చేతనైతే కెసిఆర్‌  చేసిన పనుల కంటే ఎక్కువ చేయండి. ఎక్కువ అభివృద్ధి చేయండి. గజ్వేల్లో కేసీఆర్‌ మంజూరు చేసిన పనులు ఆపితే మా గజ్వేల్‌ ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా. ఊళ్ళలో నాట్లు తక్కువ పడుతున్నాయి.

నీళ్ళు, కరెంట్‌ ఇస్తరో లేదో అని అనుమానం పడుతున్నారు. పోయిన యాసంగితో పోల్చితే ఈసారి పంట సాగు తగ్గుతున్నది. ఆ వివరాలు ప్రజల ముందు పెట్టాలి. రైతుల్లో విశ్వాసం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సాగు నీరు, కరెంట్‌, రైతు బంధు అందించాలి. సాగు పెంచాలి. కెసిఆర్‌ కోలుకుంటున్నారు. త్వరలోనే గజ్వేల్‌ క్యాంప్‌ ఆఫీస్‌కి వొస్తారు. మీ అందరితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారు. వొచ్చే లోకల్‌ బాడీ ఎన్నికల్లో మీకు పూర్తిస్థాయిలో సహకారం ఉంటుంది. లోకల్‌ బాడీ ఎన్నికల్లో ప్రజలు మనకు అద్భుతమైన విజయమందిస్తారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదు. వొచ్చే ఎంపీ ఎన్నికల్లో మూడు వంతుల ఎంపీ సీట్లు అక్కడ కాంగ్రెస్‌ ఓడిపోతుందని వార్తలు వొస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో కలిసి పని చేద్దాం. ఏడు ఎమ్మెల్యేలలో ఆరు ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు ఉన్నారు. అద్భుత విజయం సాధిస్తాం. నీళ్లు పల్లమెరుగు అంటే నీళ్లను మీదికి ఎక్కించి చూపించింది మన కేసీఆర్‌. ఎండాకాలంలో మత్తల్లు దూకేలా చేసింది కేసీఆర్‌. మల్లన్న సాగర్‌ కొండపోచమ్మ సాగర్‌లో నిండా నీళ్లు నింపి పెట్టింది కేసీఆర్‌. ఆ నీళ్లను కూడా ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. కొండపోచమ్మ సాగర్‌, మల్లన్న సాగర్‌ కాలువల్లో నీళ్లు విడుదల చేయాలని గజ్వేల్‌ నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాను. మీకు స్థానిక నాయకులతో పాటు, కేసీఆర్‌, నేనూ అందుబాటులో ఉంటాము. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కలిసి ముందుకు వెళ్దాం..అంటూ కార్యకర్తలకు భరోసానిచ్చిరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page