ఆత్మజ్ఞానంతోనే పత్రీజీ కోట్లాది మందిని ఆకట్టుకున్నారు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 29 : ఆత్మజ్ఞానుల కోసం పిఎస్ఎస్ఎం వేదిక ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని గురుమాత, స్వర్గీయ పత్రీజీ సతీమణి స్వర్ణమాల పత్రీ అన్నారు. ఆత్మజ్ఞానంతోనే పత్రీజీ కోట్లాది మందిని ఆకట్టుకున్నారని అన్నారు. ఈ మేరకు మహేశ్వర పిరమిడ్ వద్ద నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యానమహా యాగంలో శుక్రవారం ప్రాతః కాల ధ్యానానికి హాజరై ఆమె మాట్లాడుతూ పత్రీజీ ధ్యానులందరినీ ఒక తండ్రి వలే అక్కున చేర్చుకున్నాడని అన్నారు. సక్రమంగా ధ్యాన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఇంట్లో ఇల్లాలు ధ్యానం చేస్తే ఆ ఇల్లు స్వర్గం అవుతుందని అన్నారు. ధ్యానం నేర్పాలి, పిరమిడ్లు కట్టాలి, శాకాహార ప్రచారం చేయాలనే ఆలోచన, ఆచరణతోనే పత్రీజీ తన 40 ఏళ్ల జీవితాన్ని గడిపారని అన్నారు. 2024లో ‘పత్రీజీ మహిళా ధ్యాన మహా యాగం’ పేరుతో ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పరిమళ పత్రి, పరిణిత పత్రీ మాట్లాడుతూ పిఎస్ఎస్ఎంలో మహిళలకు ఉన్న స్థానం ఏ ఆధ్యాత్మిక సంస్థలోనూ లేదని ఆమె అన్నారు. కరీంనగర్ కు చెందిన నాగభూషణం, విజయలక్ష్మిలు అన్నదానానికి రూ.1 లక్ష, వేంపల్లికి చెందిన సూర్య ప్రకాష్ రావు రూ.1 లక్ష, భారతి దామోదర్ రెడ్డి రూ.25 వేల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా రట్టి మధు సూధన్ రచించిన ‘ఆహార ధర్మం’, విజయనగరానికి చెందిన శ్యామల రచించిన ‘ధ్యాన దివ్యజ్ఞాన దీపిక’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై పలువురు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలాపనలు అలరించాయి. పిరమిడ్ ఆవరణలో షడ్రుచులతో కూడిన ఉచిత భోజన, వసతి సౌక ర్యాలు కల్పించారు. కళాకారులు, కవులు, ఆధ్యాత్మిక వేత్తలను పిరమిడ్ నిర్వాహకులు సత్కరించి అభినందించారు. ఆధ్యాత్మిక గీతాలు, ధ్యాన గురువుల సందేశాలతో ధ్యాన సంబరాలు అంబరాన్నంటాయి. తొమ్మిదోరోజు పత్రీజీ శక్తి స్థల్ కు ధ్యానులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, దాట్ల హనుమంత రాజు, సభ్యులు శ్రీరాం గోపాల్, సాంబశివరావు, విజయ్ కుమార్, రాము మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page