హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన వాకిటి శ్రీహారి ముదిరాజ్ కు మంత్రివర్గంలో చోటు కల్పించి ముదిరాజులకు తగిన న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీలకు గత ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వక పోవడం శోచ నీయమన్నారు. గత ప్రభుత్వ హాయంలో రాజకీయంగా నిర్లక్ష్యానికి గురి కాబడిన ముది రాజులు బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికలో సైతం కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతామని ఆయన వెల్లడించారు. ముదిరాజ్ యువత సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి ఆ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోళ్ల కరుణాకర్ ముదిరాజ్, అధికార ప్రతినిధి కోటిక రామముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.