సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ఆటలలో చురుగ్గా పాల్గొంటే.. ఆరోగ్యంగా ఉంటారని, ఆలోచన శక్తి కూడా మెరుగవుతుందని, చిన్నప్పటి నుంచే పిల్లలు మంచి అలవాట్లను నేర్చుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)శ్రీనివాస్ రెడ్డి కోరారు.
సిద్దిపేట జిల్లా రంగనాయక సాగరు పై నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎనిమిదవ రోడ్ సైకిలింగ్ చాంపియన్ షిప్” పోటీలను మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, డీవైఏస్ఓ నాగేందర్ లు కలిసి జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాలపై కోరినట్లు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తూ నడిపించాలని చెప్పారు. ఆటలతో పాటు విద్యలో కూడా ముందుంటే ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారని తెలిపారు. ఈ పోటీలలో అండర్ 14,16,18,23 గా నిర్వహించగా., దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు మాట్లాడుతూ.. ఎన్నో క్రీడా పోటీలకు సిద్ధిపేట వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సైకిలింగ్ పోటీలకు వచ్చిన విద్యార్థులకు, క్రీడా కారులందరికీ అభినందనలు తెలిపారు. సైకిలింగ్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థికి సిద్దిపేట రైస్ మిల్లర్ సంఘం తరపున జిల్లా అడిషనల్ కలెక్టర్ నూతన సైకిల్ అందజేశారు. వీరి వెంట సిద్దిపేట రైస్ మిల్లు సంఘం అధ్యక్షుడు బాలకిషన్, ప్రతినిధులు బుచ్చన్న తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో సైకిలింగ్ జిల్లా అధ్యక్షుడు బండారు పల్లి శ్రీనివాస్, ఇంటర్ నేషనల్ కోచ్ మ్యాక్స్ వెల్, కార్యదర్శి వెంకట నర్సయ్య, రాష్ట్ర సైకిలింగ్ కార్యదర్శి విజయ కాంతారావు, సిద్దిపేట కోచ్ లు సుజాత, రవీందర్ రెడ్డి,నాయకులు కాస రవి తదితరులు పాల్గొన్నారు.