హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తెలంగాణకు చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సమీరా ఆగ్రో అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ తన ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.62.64 కోట్లు సమీకరించాలని యోచిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వారి ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫాంలో పబ్లిక్ ఇష్యూను ప్రారంభించడానికి కంపెనీ ఆమోదం పొందిందన్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 27న ముగుస్తుందన్నారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తాన్ని కంపెనీ విస్తరణ ప్రణాళికలకు వినియోగించనున్నారు. ఇష్యూ ద్వారా వచ్చిన నిధుల్లో రూ.6.62 కోట్లు తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ధర్మవరం గ్రామంలో కొనసాగుతున్న రెండు రెసిడెన్షియల్, ఒక కమర్షియల్ ప్రాజెక్టులకు, రూ.49.69 కోట్లు తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ధర్మవరం గ్రామంలో కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణానికి, రూ.3.83 కోట్లు ఆగ్రో బిజినెస్, జనరల్ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్ గా ఫస్ట్ ఓవర్సీస్ క్యాపిటల్ లిమిటెడ్ వ్యవహరిస్తుందని తెలిపారు.