మయసభలో సుయోధనునిలా ఎన్నికలలో భాజపాకు పరాభవం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రెండేళ్ళు  నిద్రపట్టకుండా చేసిన ఈటల రాజేందర్‌ రెండు అసెంబ్లీ స్థానాల్లో, అందునా సిఎం పై కూడా పోటీ చేసి ఉభయ నియోజక వర్గాల్లోనూ పరాజయం పాలవడం మరో శరాఘాతం. తెలంగాణ ఎన్నికలు బిజెపి ‘మిషన్‌ సౌత్‌’ కథల పుస్తకంలో మొదటి అధ్యాయం – వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించేందుకు అవకాశం చేజారిపోయింది. ప్రస్తుతం, దేశంలోని దక్షిణాది ప్రాంతంలో బిజెపికి రాష్ట్రం లేదు. అంతేగాక బిజెపి ఆధిక్యత సాధించిన మూడు రాష్ట్రాలలో నేటికీ ముఖ్య మంత్రుల ఎవరో తేలక పార్టీ మల్లగుల్లాలు పడుతుంతే, మరొక వైపు మోదీ తాజాగా తానే ప్రధానిగా హాట్రిక్‌ సాధిస్తానని ప్రకటించడం బిజెపి శ్రేణులను చిక్కుల్లో నెట్టింది.

అనుకున్నట్లే తెలంగాణ ఫలితాలు కాంగ్రెస్‌ వాదుల్లో ఆనందాన్ని నింపగా, గెలుపు ఆశతో సంకీర్ణానీ ఆధిపత్యం వహిస్తామని కట్టుకున్న గాలి మేడలు కూలి పోయాయి.  భాజపా శ్రేణులు   తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి . ఏడాది కిందటి వరకూ తెలంగాణలో అధికారాన్ని సాధిస్తామని గొప్పలు పోయిన కమలం పార్టీ… కేవలం ఎనిమిది స్థానాలతో సంతృప్తి పడే స్థాయికి ఎందుకు దిగజారింది? తెలంగాణ ‘కమలంలోకి బండి సంజయ్‌ రానంత వరకూ ఓ లెక్క. ఆయన వచ్చిన తర్వాత మరో లెక్క.. అన్నట్లు ఉండేది. తెలంగాణలో భాజపా పరిస్థితి. పార్టీలో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చారు. దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని కమలం ఖాతాలో చేర్చే స్థాయికి… కానీ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ను భాజపా అధిష్టానం కీలక బాధ్యతల నుంచి తప్పించి తెలంగాణలో గెలవాలన్న తన ఆశలకు తానే స్వయంగా గండి కొట్టుకుంది. సున్నిత మనస్తత్వం, వివాద రహితుడైనప్పటికీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డికి సంజయ్‌ అంత దూకుడు లేదు.  బండి సంజయ్‌ నేతృత్వంలో తెలంగాణ భాజపా ఎన్నికలకు వెళ్లి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవనే వాదన సర్వత్రా వినిపిస్తున్నది. ఈ ‘వ్యూహాత్మక’ తప్పిదం వెనుక ఉన్నదెవరు? అ%శీ%తర్గత కారణాలు ఏమిటి, తెలంగాణలో పార్టీ అవకాశాలను చేజేతులా చేజార్చుకున్నదెవరు? కార్యకర్తల మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి.

రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన పలువురు అగ్రనేతలు తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగేందుకు విముఖత చూపడం కేంద్ర నేతలను సందిగ్ధంలో పడేసింది. కొందరు నాయకుల ‘‘వ్యూహాత్మక తిరోగమనం’’ వేనుక అనేక అంశాలు కనబడుతున్నాయి సీనియర్లు, ఎంపీలు, శాసనసభ్యులు అందరూ తప్పనిసరిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని గతంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది కానీ, వివిధ కారణాలతో ఆ ఆదేశాలను వారు పట్టించుకోలేదు. గెలుపు అవకాశాలు మృగ్యమై కొందరు ఎన్నికలకు వెనుకాడారు. ముగ్గురు లోక్‌సభ సభ్యులు బండి సంజయ్‌ కుమార్‌ ధర్మపురి అరవింద్‌, యం బాపురావు.. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు,  టి.రాజా సింగ్‌ లను రంగంలోకి దించారు.  రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు, ఓబిసి విభాగం చీఫ్‌ కె. లక్ష్మణ్‌, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, పార్టీ ఇన్చార్జ్‌ ఎంపి మురళీధర్‌ రావు, సీనియర్‌ నాయకులు  కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఏపీ జితేందర్‌ రెడ్డి ఆ జాబితాలో  జాబితాలో మాయమయ్యారు.

మతం, కులం తెలంగాణలో దెబ్బతీసిందా?
జంటనగరాల పరిథిలో బిజెపి  అన్నీ సీట్లలో పోటీ చేసినా, ఆశించిన విధంగా మతపరంగా, కులాల వారిగా,  అనుకూలంగా ప్రజల మద్దతు లభించలేదు. 2020లో జరిగిన  నగరపాలక సంస్థ ఎన్నికల్లో అనూహ్యంగా 48 మంది  కార్పొరేటర్లు గెలిచినారన్న ధీమాతో బిజెపి రాష్ట్రంలో మొత్తం 111 స్థానల్లో అభ్యర్థులను పోటీకి దింపి, 8 స్థానాల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నా పరువు మిగలలేదు. బిజెపి గెలిచిన ఎనిమిది సీట్లలో ఏడు ఉత్తర తెలంగాణ నుండి, నగరంలో ఒక్కటి మాత్రమే దక్కాయి. అవన్నీ మతపరమైన సున్నితమైన ప్రాంతాలు. ఒక్క రాజాసింగ్‌ మినహా గెలుపొందిన వారు కూడా తొలిసారిగా పార్టీలోకి వచ్చినవారు లేదా కొత్తవారే. కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు, పీసీసీ చీఫ్‌ ఏ రేవంత్‌రెడ్డి ని ఓడిరచి జెయింట్స్‌ కిల్లర్‌గా బీజేపీ అభ్యర్థి కె వెంకట రమణా రెడ్డి నిల్వడం అత్యంత ఆశ్చర్యకర విషయం. ఆర్మూర్‌, నిర్మల్‌, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌, ఆదిలాబాద్‌, ముధోల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బోత్‌ సెగ్మెంట్‌ లలో బీజేపీ విజయం సాధించి గోషామహల్‌ ను కష్టం మీద నిలబెట్టుకుంది.

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోరుట్ల నుంచి పోటీ చేయగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ చేతిలో 10వేల వోట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ – బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ చేతిలో ఓడిపోయారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు బోథ్‌ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనిల్‌ జాదవ్‌ చేతిలో 22 వేల వోట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలవటం పట్ల ఆనందించాలో.. లేక ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు, అందులో ఇద్దరు కీలక నేతలు ఓడిపోయారని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. ఈ పరిణామంతో తెలంగాణలో బీజేపీ గెలిచినట్టా.. ఓడినట్టా.. అని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ  ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు.

ఆకట్టుకోలేని అగ్రనాయకత్వం    
బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఇతర జాతీయ స్థాయి నేతలు ప్రచారం కోసం పలుమార్లు తెలంగాణలో పర్యటించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే మోదీ తెలంగాణలో పర్యటించి రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు. షెడ్యూల్‌ విడుదలైన తరువాత ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించి ఎనిమిది బహిరంగ సభల్లో ప్రసంగించారు. నవంబర్‌ 27న ప్రచారం ముగియడానికి ముందు, హైదరాబాద్‌లో మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. అమిత్‌ షా ఎనిమిది సార్లు తెలంగాణలో పర్యటించి 17 బహిరంగ సభలు, ఏడు రోడ్‌ షోలలో ప్రసంగించారు.
ఎంత ప్రయత్నించినా హైదరాబాద్‌ లోని ఒక్క గోషామహల్‌ లో మాత్రం బిజెపి ప్రతిష్ఠ నిలబెట్టుకోగా మిగిలిన చోట్ల అడ్రస్‌ గల్లంతయింది. మోదీ, అమిత్‌ షా,. బిజెపి తరపున కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, నడ్డా వంటి జాతీయ నాయకుకులు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి వంటివారు ప్రచారం చేస్తూ, అయోథ్య  ఆలయం నిర్మాణం గురించి, రాష్ట్రంలో వయోధికులకు వాసులకు ఉచిత ప్రయాణం, దర్శనం ఆశ చూపినా అచ్చిబాటు కాలేదు. బిజెపి పార్టీ మత ఆధారిత రిజర్వేషన్‌లను రద్దు చేస్తుందని, ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్‌ తెగల కోటాను పెంచుతుందని చెప్పారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే  ప్రస్తుతం విద్య  ప్రభుత్వ ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్లకు అర్హులైన  మైనారిటీ ముస్లిం సమాజంలోని వెనుకబడిన సభ్యులు పూర్తిగా నిరాదరణకు గురవుతారన్న భయం ఏర్పడిరది.. జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్ర మొత్తం ముస్లిం జనాభా 12.7 శాతంగా అంచనా. కాంగ్రెస్‌, అధికారంలో ఉన్న భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) రెండూ వెనుకబడిన వర్గ వ్యతిరేక పార్టీలని, బీజేపీ మాత్రమే వెనుకబడిన వర్గాలకు మేలు చేయగలదని చెప్పినా ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్‌ తెగలకు నమ్మకం కలగలేదు.

విద్యాధికులు, నగరవాసుల మద్దతూ లేదు…
భాజపా హామీల్లో మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు, ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా దేశీ ఆవులను అందించడం వంటివి ఉన్నాయి. కళాశాల విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు మరియు 21 ఏళ్లు నిండిన తర్వాత రీడీమ్‌ చేసుకోగలిగే ఆడపిల్లకు పుట్టిన సమయంలో రూ. 2 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఇస్తామని బిజెపి పోల్‌ హామీ ఇచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం మొత్తం పోటీ చేసిన 111 సీట్లలో కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రం గెలిచింది. తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. మొన్నటివరకు బీఆర్‌ఎస్‌-బీజేపీగా ఉన్న రాజకీయ పోరు చివరకు బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌గా మారిపోయిన్ది. ఇటీవలివరకూ సత్తా చాటిన బీజేపీ బలహీనపడిరది. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు, బీజేపీలో అంతర్గత కలహాలు తెలంగాణాపై ప్రభావం చూపాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ రాజకీయ రణంలోలో దూసుకెళ్తుంటే.. బీజేపీలో చలనం లేకపోయింది. ఆగిపోయింది. బీజేపీని బీఆర్‌ఎస్‌ పట్టించుకో లేదు. కేసీఆర్‌ సహా ఆ పార్టీ నేతలంతా కాంగ్రెస్‌నే టార్గెట్‌ చేసారు.

బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ పార్టీలపైనే తెలంగాణ ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది.  బీజేపీ పక్కతోవ పట్టింది.. బిజెపై అగ్రనేతలు ముగ్గురు నలుగురు బహిరంగ సభలలో తప్ప స్థానికంగా ప్రభావం చూపలేక పోయారు. బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయలేదు. బీఆర్‌ఎస్‌ కూడా బిజెపిని పట్టించుకోలేదు. బీజేపీ నేతలకు తెలంగాణలో పని లేకుండా పోయింది. మాజీ  అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా అప్పుడప్పుడు మాత్రమే ప్రభుత్వంపై విమర్శలు చేసారు. మిగతా నేతలు   మాట మాట్లాడలేదు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందన్న నమ్మకం బలంగా పాతుకుపోయింది. బీజేపీ-బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటే అని కాంగ్రెస్‌ చేసిన విమర్శలకు తాజా పరిణామాలు బలం చేకూర్చాయి.

టీ బీజేపీ పరాజయాలు, విభేదాల ముసలం..?
బీజేపీలో నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఒకరితో మరొకరికి పడలేదు. నేతలు కలిసికట్టుగా పనిచేయలేదు. బండి సంజయ్‌?పై ఈటల, విజయశాంతి, వివెక్‌ ఇతర నేతల అసంతృప్తి పెరిగింది.  పార్టీలో కోవర్టుల అంశం కలకలం రేపింది. మొన్నటివరకు కాంగ్రెస్‌ సొంతమైన సంస్కృతి బీజేపీకి అంటుకుంది.  బీజేపీకి చెందిన కీలక నేతలు  కాంగ్రెస్‌లో చేరడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.   బీజేపీలో చురుకుతనం, చొరవ తగ్గాయి. పార్టీ శ్రేణులు నిరాశలోమునిగిన నేపథ్యంలో ఎన్నికలు జరిగి సంఖ్య బలం నీరసించింది. బీజేపీ-బీఆర్‌ఎస్‌ బంధం పై పార్టీ నేతలు మౌనం వహించడం, పాత కాలపు వారు, కొత్తవారు, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారి మధ్య అంతర్గత పోరు, స్పష్టత లేకపోవడం. నిధులపై సీనియర్ల అయిష్టతకు కొన్ని కారణాలని చెప్పారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ కు రెండేళ్ళు  నిద్రపట్టకుండా చేసిన ఈటల రాజేందర్‌ రెండు అసెంబ్లీ స్థానాల్లో, అందునా సిఎం పై కూడా పోటీ చేసి ఉభయ నియోజక వర్గాల్లోనూ పరాజయం పాలవడం మరో శరాఘాతం. తెలంగాణ ఎన్నికలు బిజెపి ‘మిషన్‌ సౌత్‌’ కథల పుస్తకంలో మొదటి అధ్యాయం – వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించేందుకు అవకాశం చేజారిపోయింది. ప్రస్తుతం, దేశంలోని దక్షిణాది ప్రాంతంలో బిజెపికి రాష్ట్రం లేదు. అంతేగాక బిజెపి ఆధిక్యత సాధించిన మూడు రాష్ట్రాలలో నేటికీ ముఖ్య మంత్రుల ఎవరో తేలక పార్టీ మల్లగుల్లాలు పడుతుంతే, మరొక వైపు మోదీ తాజాగా తానే ప్రధానిగా హాట్రిక్‌ సాధిస్తానని ప్రకటించడం బిజెపి శ్రేణులను చిక్కుల్లో నెట్టింది. అంతేకాదు, ముఖ్యమంత్రి, ఇతర మంత్రిత్వ శాఖల పంపిణిలో అంతర్గత కుమ్ములాటలో  పడి కాంగ్రెస్‌ పరువు పోగొట్టుకుని చీలిక వచ్చి అధికారానికి దూరమైతే ప్రభుత్వంలో భాగస్వామి కావచ్చునన్న ఆశ నిరాశగా మిగిలింది. డిసెంబర్‌ మూడో తేదీ ఫలితాలు వచ్చిన 24 గంటలలో తెలంగాణ ప్రభుత్వంలో పదవులకు అంగీకారానికి రావడం 7వ తేదీ ప్రమాణ స్వీకారం పూర్తికావడం, 9వ తేదీ మంత్రిత్వ శాఖల పంపిణి సంతృప్తికరంగా సాగడం, అసెంబ్లీ సమావేశాలు మొదలై సభ్యుల ప్రమాణం అయిపోవడం భాజపాను ఇబ్బందిలోకి నెట్టింది.

ఇదిలా ఉండగా సీనియర్‌ ఎంఐఎం శాసన సభ్యుడు అక్బరుద్దిన్‌ ఒవైసీని ప్రభుత్వం ప్రోటెం స్పీకర్‌ గా ప్రకటించి ఆయన నేతృత్వంలో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించడం గోరుచుట్టుపై రోకటి పోటులా తయారైంది. పలువురు సీనియర్లను పక్కన పెట్టి నిరంకుశ నిజాం వారసత్వానికి ప్రోటెం స్పీకర్‌ ఆస్కారం కల్పించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు, ఎనిమిది మంది బిజెపి సభ్యులు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరై, గవర్నర్‌ కు ప్రభుత్వం పై ఫిర్యాదు చేయడం పార్టీ సెక్యులర్‌ విధానానికి వ్యతిరేకమన్న మరొక అపవాదు మూట కట్టుకున్నట్టయింది.

-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్‌ జర్నలిస్ట్‌,
98481 28215  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page