ఇంట్లో జారిపడ్డ మాజీ సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం అర్ధరాత్రి ఫామ్‌ హౌస్‌ బాత్‌ రూమ్‌లో జారి పడటంతో ఆయన తొంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అక్కడ కేసీఆర్‌కు చికిత్స కొనసాగుతున్నది. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని, యశోదా హాస్పిటల్‌ వద్ద భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి యశోద హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ వైద్యులను అడిగి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్‌ సెక్రటరీకి యశోద వైద్యులు తెలియజేశారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.

గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ క్లియరెన్స్‌తో కేసీఆర్‌ను పోలీస్‌ అధికారులు హాస్పిటల్‌కి తరలించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద హాస్పిటల్‌ వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు. ఆపరేషన్‌ చేసి తుంటి ఎముక రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు బులెటిన్‌లో వెల్లడిరచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని హాస్పిటల్‌లోని వివిధ విభాగాల వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని వెల్లడిరచారు. కేసీఆర్‌పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా హాస్పిటల్‌లో కేసీఆర్‌ వెంట కవిత, కేటీఆర్‌, హరీష్‌ రావు ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్‌ రావొద్దని అభిమానులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే హరీష్‌ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page