పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో… నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

  • మధ్యాహ్నం  మహాలక్ష్మి ఫ్రీ బస్‌ పథకాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సిఎం రేవంత్‌
  • మార్గదర్శకాలు వెల్లడించిన  టిఎస్‌ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం నేటి నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి మహాలక్ష్మి ఫ్రీ బస్‌ స్కీమ్‌ను నేడు అసెంబ్లీ ఆవరణలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి వారం రోజుల పాటు ఎటువంటి ఐడి కార్డు చూపించాల్సిన అవసరం లేదని, తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆధార్‌ వంటి ఏదో ఒక ఐడి కార్డు చూపించి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవొచ్చని ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌ తెలిపారు. జీరో టికెట్‌ ఇస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో వయస్సుతో నిమిత్తం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవొచ్చని, రాష్ట్ర పరిధి దాటి ప్రయాణానికి టారిఫ్‌ ప్రకారం చార్జ్‌ చేస్తారని తెలిపారు. ప్రస్తుతానికి 7,200 బస్సులను ఈ పథకం కోసం వినియోగించ నున్నామని అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని తెలిపారు. త్వరలో ఆధునిక సాఫ్ట్‌ వేర్‌తో రూపొందించిన స్మార్ట్‌ కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సదుపాయం కలిగించడం ద్వారా ఆర్టీసీపై పడుతున్న భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని నేడు మధ్యాహ్నం అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎంఎల్‌ఏలు, సిఎస్‌, నిఖత్‌ జరీన్‌ వంటి సెలబ్రిటీల సమక్షంలో సిఎం రేవంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని సజ్జనార్‌ వెల్లడిరచారు. ఇక తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి ప్రీ బస్‌ పథకం కూడా ఒకటి. నేటి నుంచి ఈ గ్యారెంటీ అమలులోకి వొస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. మొత్తం ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ముందుగా రెండు గ్యారెంటీలను అమలులోకి తెస్తుంది. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఇందులో ఒకటి కాగా, మహిళల ఉచిత ప్రయాణం మరో ప్రధాన గ్యారెంటీ. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం ఉంది. గురువారం కేబినెట్‌ విూటింగ్‌ తర్వాత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఈ పథకంపై వివరాలు తెలియజేశారు. మహిళలు తమకు సంబంధించిన ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవొచ్చని చెప్పారు.

ఆధార్‌ కార్డు లేదా ఇతర కార్డులు చూపించి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశముంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో 40 శాతం మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఈ పథకంతో ఇది 55 శాతం దాకా వెళ్లే అవకాశం ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సర్వీసులు పెంచే అవకాశం ఉంది. రోజు వారి ఆదాయం రూ. 14 కోట్లు ఉంది. పథకం అమలైన తర్వాత ఆదాయం 50 శాతం తగ్గిపోతుంది. అంటే రూ. 7 కోట్ల దాకా వొస్తుంది. రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. రాబోయే రోజుల్లో 1,050 కొత్త బస్సులు రాబోతున్నాయి. వెయ్యి ఎలక్టిక్ర్‌ బస్సులు తీసుకుంటున్నామని, అందులో 500 సిటీకి, 500 రూరల్‌ ఏరియాకు వొస్తాయని సజ్జనార్‌ స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం నెలనెలా ఈ ఖర్చులను భరిస్తూ ఆర్టీసీకి సాయం చేస్తే పథకం సాఫీగా అమలవుతుంది. ఎక్కడ తేడా వొచ్చినా ఈ పథకం అభాసుపాలవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page