సమర్థత ఉన్న వ్యక్తినే పదవులు వరిస్తాయని స్వల్పకాలంలోనే రుజువు చేసారు. సమర్థత ఉంది కాబట్టే రేవంత్ రెడ్డిని పదవులు వరిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికల సమయంలో తన సమర్థత ప్రదర్శించే తెలంగాణలో అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారని బలమైన వాదన వినిపిస్తున్నది. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే కేసీఆర్ ను తీవ్రస్థాయిలో ఎదుర్కోంటూ బలంగా విమర్శిస్తున్న నేత కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. పైగా కేసీఆర్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ నేత కూడా ఆయనే. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరూ తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు కానీ రేవంత్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు చుట్టబెట్టారు. సీఎం అభ్యర్థిగా తమకు అర్హతలున్నాయని అని భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు ఉత్సాహం ప్రదర్శించిన సీఎం అభ్యర్థి స్థాయిలో గెలుపు బాధ్యత భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జాతీయ నేతలతో పర్యటించింది రేవంత్ ఒక్కరే. ఆయనతో పాటు పాద యాత్రతో అంతకష్టపడ్దది మాత్రం మల్లు భట్టి విక్రమార్క.
రేవంత్‌రెడ్డి తాను పోటీ చేస్తున్న కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాలను కూడా సుడిగాలి పర్యటనలు చేసి భారాస పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కంటే ఇతర నియోజకవర్గాల్లోనే ఆయన ప్రచారం చేయడం ఇక్కడ గమనార్హం. అందుకే ఆయనకే సీఎం అభ్యర్థి అర్హత ఉందని అన్నారు. ఆయన ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు. ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని, వెనకడుగు వేయక పోరాటం చేసిన నాయకుడు. ఈ అంశాలే ఆయన్ని సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీకి అనతి కాలంలోనే రాష్ట్ర బాధ్యతలు చేపట్టేలా చేసింది.. ఇప్పుడు ఏకంగా సీఎం రేసులోకి రావడంతో తెలంగాణ ప్రజల చూపంతా రేవంత్ పైనే ఉంది. పెయింటర్ గా జీవితం ప్రారంభించి రాజకీయ రంగ ప్రవేశం చేసి యువనాయకుడిగా ఎదిగి, సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టి రాజకీయ ప్రయాణానికి సుస్థిర బాటలు వేసుకున్న సమర్థ నేత రేవంత్ అనడంలో సందేహం లేదు.
రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సహాన్ని తీసుకురావడంలో విజయం సాధించారని ఆ పార్టీలోని నాయకులే అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచనలేకుండా ప్రచారం చేసి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి హైకమాండ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2021 జులై నెలలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా నియమితులైన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం చెయ్యడానికి రోడ్ల మీదకు వచ్చి ప్రముఖంగా కనిపించారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టడానికి రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సమస్యలపై వీధిపోరాటాలు చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని యువతకు అండగా నిలిచి వారిని ప్రోత్సహించారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న రేవంత్ వారి మన్ననలు పొందారు. సొంత పార్టీలో వ్యతిరేకించి నిరసనలు తెలిపినప్పటికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అండతో రేవంత్ వెనుకా ముందు ఆలోచించకుండా పక్కా ప్రణాళిక, వ్యూహంతో వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో నిత్యం టచ్ లో ఉన్న రేవంత్ ఆ పార్టీ అగ్ర నాయకత్వంలో గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన నాయకుల్లో కొందరు తరువాత ఆయనకు మద్దతు పలికారు. ప్రత్యక్షంగా ప్రియాంక, రాహుల్, ఖర్గే, డి కె, దిగ్విజయ్, వేణుగోపాల్, ఠాక్రే తో పర్యటించి, సమాలోచనలు జరిపి సాన్నిహిత్యం పెంచుకుని, సమర్థుడన్న పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల ప్రచార జోరు పెంచడానికి తెలంగాణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.
తెలుగుదేశంతో రాజకీయ జన్మ..
2007లో స్వతంత్ర అభ్యర్థిగా రేవంత్ రెడ్డి శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.. తరువాత ఎమ్మెల్సీగా గెలవడంతో అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినా, దివంగత సీఎం ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న అభిమానంతో తెలుగుదేశం లో చేరారు. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి 46.46% వోట్లతో ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ విజయం ఆయన చరిష్మాను మరింతగా పెంచింది. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మరోసారి ఆయన ఘన విజయం సాధించారు. 2009 – 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, 2014 – 2018 మధ్య తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు.
వోటుకు నోటు కేసు..
శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా వోటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు లంచం ఇవ్వజూపారన్న అభియోగం పై 2015 మే 31న, రేవంత్ రెడ్డిపై స్టింగ్ ఆపరేషన్ చేసి అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. అవినీతి నిరోధక చట్టం నేరపూరిత కుట్ర నెపం కింద క్రిమినల్ కేసు లో రేవంత్‌తో పాటు బిషప్ సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహా అరెస్టయి చర్లపల్లి సెంట్రల్ జైలుకు వెళ్లారు. జూన్ 30న వీరికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చెయ్యగా జులై 1న రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. నాటి నుంచీ మనిషిలో కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర సమితిని అధికార పీఠం నుంచి పడగొట్టాలన్న పట్టుదల పెరిగింది.
స్వల్పకాలంలోనే రాష్ట్ర కాంగ్రెస్ కిరీటం
2017 అక్టోబరు 25న, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారన్న సమాచారంతో తెదేపా, ఆయనను టీడీపీ ఫ్లోర్ లీడర్ హోదా నుంచీ తొలగించింది. అక్టోబర్ 31న రేవంత్ కాంగ్రెస్‌లో చేరారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయి, తొలి ఓటమి రుచి చూసారు. 2018 సెప్టెంబర్ 20న, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా నియమితులయ్యారు. 2018 శాసనసభ ఎన్నికల ఓటమి తరువాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ సమీప ప్రత్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై 10,919 ఓట్ల ఆధిక్యతతో 38.63ఓట్ల శాతం సాధించి పార్లమెంట్ సభ్యుడయ్యారు.
2021 జూన్ లో ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో రేవంత్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులై 7 జూలై 2021న కొత్త పాత్రలో ఇమిడిపోయారు. నిన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కొడంగల్ నియోజకవర్గం, కామారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కొడంగల్ నుంచి గెలిచి ఆయన కామారెడ్డిలో పరాజయం పొందారు.2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా (టీపీసీసీ) జూన్ 26, 2021లో కాంగ్రెస్ అధిస్ఠానం నియమించింది.
2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి కేసీఆర్ పాలనపై వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. కె సి ఆర్ ను, భా రా స ను ఓడిరచడమే లక్ష్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. డిసెంబర్ 3, 2023న తన లక్ష్యాన్ని సాధించారు. కేసీఆర్‌ని ఓడిరచి ముఖ్యమంత్రిగా స్వీకార స్థాయికి చేరి బాధ్యతలు చేపట్టేస్థాయికి ఎదిగారు. ఉనికే ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయనే కీలక పాత్ర పోషించారడంలో ఎలాంటి సందేహం లేదు.
కింది స్థాయి నుంచి..
రేవంత్‌రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో అనుముల నర్సింహారెడ్డి, అనుముల రామచంద్రమ్మ దంపతులకు. జన్మించారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్యాడ్యుయేషన్ పట్టా పొందారు. రేవంత్ రెడ్డికి తొలుత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆయన కింది స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన సతీమణి గీత. రేవంత్‌రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో సభ్యుడు. 2006లో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుండి జడ్ పి టి సి సభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్(బీఆర్ఎస్), బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని లోని మిడ్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ గెలుపు పార్టీలన్ని ఒక్కసారిగా రేవంత్ వైపు చూసేలా చేశాయి. అక్కడే ఆయన నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి
-నందిరాజు రాధాకృష్ణ