తెలంగాణ మలి ఉద్యమంలో తొలి ఆత్మత్యాగం

నేడు శ్రీకాంతచారి వర్ధంతి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. శ్రీకాంతచారి (ఆగష్టు 15, 1986 – డిసెంబర్‌ 3, 2009) మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమర వీరుడు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కుమారుడుగా సాధారణ కుటుంబంలో 1986 సంవత్సరంలో స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు15) రోజున జన్మించాడు. తండ్రి వెంకటచారి వ్యవసాయంతో పాటు వృత్తి పనులు చేస్తుంటాడు. రవీంద్రాచారి అనే తమ్ముడు ఉన్నాడు.  శ్రీకాంతచారి ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండేవాడు. సమాజసేవలో ముందుండేవాడు. ఎవరు సాయం కోరినా కాదనేవాడు కాదు. తాను దాచుకున్న డబ్బును పేదలు, స్నేహితుల కోసం ఖర్చు చేసేవాడు. స్థానికంగానే ప్రాథమిక విద్యను పూర్తిచేసిన శ్రీకాంత్‌ మోత్కూరు, నకిరేకల్‌ గ్రామాల్లో అభ్యసించాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్లిన శ్రీకాంత చారి తొలుత బీజేపీ లో ఆ తరువాత టీఆర్‌ఎస్‌ లో క్రీయాశీలక కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్రను పోషించాడు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపేవాడు. సెలవుల్లో ఇంటికి వెళ్లినా.. తెలంగాణ ధ్యాసే. తెలంగాణ ఉద్యమ సంబంధిత పాటలు పాడుతూ తెలంగాణ నినాదాలు చేస్తూ కవితలు రాస్తూ ఉండేవాడు. తెలంగాణ అతడి ఊతపదమైంది.

ఈ క్రమంలో తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన అమరణదీక్ష శ్రీకాంత్‌లో ఉద్యమావేశాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమ కారులపై ప్రభుత్వం దమనకాండ, అరెస్టులను చూసి శ్రీకాంత్‌ తట్టు కోలేక పోయాడు. ఆ ఉద్వేగంతో, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన ఆత్మ త్యాగం తర్వాతైనా మొండి ప్రభుత్వంలో చలనం తీసుకు రావాలని కోరుతూ ఆత్మాహుతికి యత్నించాడు. 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో కేసీఆర్‌ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో ఒంటిమీద పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించు కున్నాడు. ఉద్యమ జ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటూ నినదించాడు. నీవైనా న్యాయం చేయమంటూ అంబేద్కర్‌ విగ్రహాన్ని వేడుకున్నాడు. కాలిన గాయాలతో కామినేని, యశోద, ఉస్మానియాతో పాటు చివరకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్‌ 3, 2009 న రాత్రి 10.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచాడు. ఐదు రోజుల పాటు మత్యువుతో పోరాడుతూ కూడా తెలంగాణ స్మరణ చేశాడు. బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమన్నాడు. ఎగిసే మంటల్లో  బూడిదవుతుంటే టీవీల్లో చూసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెలు రగిలాయి. ప్రతి ఒక్కరూ ఉద్యమానికి ఉద్యుక్తులయ్యేలా శ్రీకాంతచారి ఉద్యమజ్వాల రగిలించాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన శ్రీకాంతచారి తెలంగాణ ప్రజలందరి గుండెల్లో త్యాగానికి ప్రతి రూపంగా శాశ్వతంగా నిలిచిపోయాడు.
– రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page