ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఉప్పల్ నియోజకవర్గంలో కేంద్ర నిధులతో నేను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ అభివృద్ధి చూసి ప్రజలు నాకు మరోసారి పట్టం కట్టబోతున్నారని ఉప్పల్ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ను గద్దె దించాలి లేదంటే మనకు ఈ బాధలు పోవని అన్నారు. బీజేపీ వస్తే మేనిఫెస్టోలో ఏ ప్యాకేజీ ఉన్నాయో అవన్నీ ఇస్తాం.. మీ ఇళ్లలో నాలుగు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తాం.. కల్యాణ లక్ష్మి, పింఛన్లు ఏవీ ఆగవు. ఇద్దరు ముసలోళ్లకు పెన్షన్ ఇస్తాం.. మీ కుటుంబంలో వైద్యం ఖర్చు మీద పడితే పది లక్షల వరకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తాం అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పిల్లలకు మంచి వైద్యం అందిస్తాం. మంచి విద్య అందిస్తాం.. పండించే వరి ధాన్యాన్ని కిలో తరుగు లేకుండా గింజ వదిలిపెట్టకుండా కొనే జిమ్మేదార్ బీజేపీ తీసుకుంటుంది. క్వింటాకు 3100 రూపాయల మద్దతు ధర ఇస్తాం అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లల్లో ఇద్దరు ముసలోళ్లకు ఇద్దరికి పింఛన్లు ఇస్తుంది. ఎవరొచ్చినా పింఛన్లు ఆగవ్. నా రెండు పింఛన్లు ఇచ్చే జిమ్మేదార్ మాది. పేద ఇళ్లల్లో బతికేవారు ఉజ్వల గ్యాస్ ఉన్నవారికి ఏడాదికి నాలుగు సిలిండర్లు ఇస్తాం.. మీ ఊళ్లలో వైద్యం ఖర్చులు భరించే పరిస్థితి లేకుండా క్యాన్సర్ పేషంట్లు, హార్ట్ ఎటాక్, యాక్సిడెంట్లలో బాధితులకు ఇకపై ఆ బాధ లేకుండా బీజేపీ అధికారంలోకి వస్తే 10 లక్షల వైద్య ఖర్చులన్నీ మేమే భరిస్తాం. ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటానని ఎన్.వి.ఎస్.ఎస్ పేర్కొన్నారు.