రాష్ట్రంలో 62 శాతం రైతులు 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు. మొత్తం రైతు బంధు నిధులలో వాళ్ళకి వచ్చేది పావు వంతే. వీరే ఎక్కువ కౌలు రైతులు కూడా. అయితే 5 ఎకరాలు పైగా సొంత భూమి ఉన్న రైతులు 14 శాతం మాత్రమే అయినా, రైతు బంధు నిధులలో దాదాపు సగం, అంటే 7000 కోట్లు వారికే వెళ్తున్నాయి. వీరిలో ఎక్కువ భాగం సొంతంగా పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయని వారే. మరి సాగుచేస్తున్న రైతులకి కడుపు మండితే ఆశ్చర్యం ఎందుకు?
ఏదో విధంగా రైతు బంధు యాసంగి సీజన్ డబ్బులు ఎన్నికల లోపే రైతుల అకౌంట్లలో వేయడానికి ప్రభుత్వం చూపిన తొందరపాటు, ఈ రొటీన్ వ్యవహారాన్ని రైతుల వోట్లు దండుకోవడానికి ఆర్థిక మంత్రి చూపిన ఆతృత, దానిని ఎలక్షన్ కమిషన్ ఆపడం పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న లొల్లి .. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీని వెనుక స్పష్టంగా కనిపిస్తున్నది రైతుల వోట్లు తమకు పడవు అని బీఆర్ఎస్ పార్టీ పడుతున్న భయం.
తాము ఇంత గొప్పగా చెప్పుకుంటున్న రైతు బంధు పథకం తర్వాత కూడా మెజారిటీ రైతులు ఎందుకు ఇంత అసంతృప్తితో ఉన్నారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆశ్చర్యపోతూ ఉండచ్చు. ముఖ్యంగా రైతుల గురించి తమ ముఖ్యమంత్రికి తెలిసినంత ఇంకెవరికీ తెలియదు అని గుడ్డిగా నమ్మిన వారికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ క్షేత్ర స్థాయిలో రైతులతో పని చేసే వారికి ఇది ఆశ్చర్యకరం కానే కాదు. ఏ గ్రామానికి వెళ్ళినా మాకు వినిపించేది, ‘‘దున్నే వాడికి డబ్బులు ఇవ్వకుండా సాగు చేయని వాళ్ళ అకౌంట్లలోనే వేస్తున్నారు, ఎక్కువ భూమి ఉన్నోళ్ళకే సాయం చేస్తున్నాడు కేసీఆర్’’ అన్న మాట. తెలంగాణలో మెజారిటీ రైతులు ఒకటి రెండు ఎకరాలు స్వంత భూమి ఉన్నవారు. అది కుటుంబం గడవటానికి సరిపోదు కాబట్టి మరో నాలుగైదు ఎకరాలు కౌలుకి తీసుకొని సాగు చేస్తారు. అలాగే స్వంత భూమి లేని రైతులు కూడా కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నారు. ఈ రెండు రకాల కౌలు రైతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాది రైతు స్వరాజ్య వేదిక చేసిన విస్తృత అధ్యయనంలో 36 శాతం రైతులు కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నారని తేలింది. అంటే 22 లక్షల మంది కౌలు సాగు చేస్తున్న కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి. ‘‘మా ప్రభుత్వం సొంత రైతుల కోసమే పని చేస్తుంది, కౌలు రైతుల కోసం కాదు’’ అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినప్పుడే ఆయనది ఎంత తీవ్ర అన్యాయ ధోరణి అన్నది బయట పడిరది. ఎకరానికి 30 వేలు పైగా పెట్టుబడి పెట్టి, అదనంగా కౌలు డబ్బులు చెల్లిస్తూ, పంటలు పండిస్తున్న కౌలు రైతులు ఎటువంటి ప్రభుత్వ సహాయం లేక అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం వాళ్ళకి ఎందుకు అందకూడదు? ఈ చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతుల మీద కేసీఆర్ గారికి ఎందుకంత కక్ష?
రాష్ట్రంలో 62 శాతం రైతులు 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు.
మొత్తం రైతు బంధు నిధులలో వాళ్ళకి వచ్చేది పావు వంతే. వీరే ఎక్కువ కౌలు రైతులు కూడా. అయితే 5 ఎకరాలు పైగా సొంత భూమి ఉన్న రైతులు 14 శాతం మాత్రమే అయినా, రైతు బంధు నిధులలో దాదాపు సగం, అంటే 7000 కోట్లు వారికే వెళ్తున్నాయి. వీరిలో ఎక్కువ భాగం సొంతంగా పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయని వారే. మరి సాగుచేస్తున్న రైతులకి కడుపు మండితే ఆశ్చర్యం ఎందుకు? మరీ అన్యాయం ఏమిటంటే కౌలు రైతులను గుర్తించడమే అసాధ్యం అని ముఖ్యమంత్రి చెప్పడం. అంతే కాక, కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకి కూడా రైతు భరోసా ప్రకటిస్తే దానిని అసాధ్యం అని హేళన చేయడం. ఇది పూర్తి అబద్ధం. అది ముఖ్యమంత్రికి కూడా తెలుసు. ఎందుకంటే 2011 లో వచ్చిన ‘‘భూ అధీకృత సాగుదారుల చట్టం’’ ఇప్పటికీ తెలంగాణలో అమలులో ఉంది. దాని ప్రకారం ప్రతి కౌలు సాగుదారు ఒక ‘గుర్తింపు కార్డు’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు %–% దరఖాస్తు పరిశీలించి గుర్తింపు కార్డు ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యం. అంతే కాదు 2015-16 లో టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 44,000 మంది కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి కౌలు దారుల సోయ లేదు కాబట్టి ఆపేశారు.
భూ యజమానులను భయపెట్టడానికి కౌలు రైతులను బూచిగా చూపించే ప్రయత్నం కేసీఆర్ మాత్రమే కాక కేటీఆర్ కూడా మొదలు పెట్టారు. ఇది అన్నిటి కంటే పెద్ద అన్యాయం. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ పాత కాలం దొరలుగా మాత్రమే వ్యవహరిస్తున్నారు, ప్రజాస్వామిక నాయకులుగా కాదు అని నిరూపించుకున్నారు. 2011 చట్టం ప్రకారం కౌలు రైతు కి గుర్తింపు కార్డు ఇచ్చినంత మాత్రాన ఆ భూమి పై వారికి ఎటువంటి యాజమాన్య హక్కులు లభించావు అని స్పష్టంగా ఉంది. 2015-16 లో వారి ప్రభుత్వమే 44,000 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినప్పుడు ఒక్క కౌలు రైతు కూడా భూమి హక్కుల కోసం లొల్లి చేయలేదే. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో సంవత్సరానికి 7 లక్షలకు పైగా కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇస్తున్నారు.. 12 సంవత్సరాల నుండి ఇస్తున్నారు.. అయినా ఒక్క కేసు కూడా కౌలు రైతు భూమి ఆ కార్డు పై భూమి హక్కు పొందేందుకు వేయలేదే. మరి ఎందుకు లేని పోని భయాలు సృష్టిస్తున్నారు? అదే విధంగా ధరణి వ్యవస్థ ద్వారా చిన్న సన్నకారు రైతులు సాగు చేస్తున్న లక్షలాది ఎకరాల భూమి వారి పేరు మీద లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా అసైన్డ్ భూమి ఉన్న దళిత రైతులు, సీలింగ్ భూములు పొందిన చిన్న రైతుల చేతిన నుండి భూమిని లాక్కొన్నారు. సాదా బైనామాల భూములు లక్షలాది ఎకరాలు రెగ్యులరైజ్ అవలేదు. భూ రికార్డుల ప్రక్షాళన కాస్తా పేద వాళ్ళ చేతిలో నుండి ‘‘భూ ప్రక్షాళన’’ గా అయింది. పార్ట్ బి సమస్యలు 6 నెలలలో పరిష్కారం చేస్తామన్నారు, ఇప్పుడు అయిదేళ్లు అయినా ఆ ఊసు లేదు. అసైన్డ్ భూములు తండ్రి వద్ద నుండి పిల్లలకు బదిలీ చేయడం చట్ట బద్ధమే అయినా, ధరనిలో ఆ ఆప్షన్ పెట్టలేదు. ఎప్పటికైనా ఆ భూములను దళితుల వద్ద నుండి లాక్కోవడం ఆప్షన్ గా పెట్టుకున్నారు అని అనుమానం వస్తుంది.
కౌలు రైతులకు అన్యాయం చేయడం వెనకా, ధరణి ద్వారా చిన్న రైతుల భూములు లాక్కోవడం వెనకా, రైతు బంధు కానీ ఇతర పథకాలు కానీ కేవలం భూమి పట్టాదారుకి మాత్రమే వర్తిస్తాయి అనడం వెనకా, ఒకటే కారణం. ముఖ్యమంత్రి గారు తాను ఫ్యూడల్ దొరగా, భూస్వామ్య, జమీందారీ కాలం నుండి వచ్చిన దృక్పథంతోనే వ్యవహరించడం. అదే ఆయన ప్రవృత్తి. అందుకే భూ సంస్కారణలన్నా, పేదలకు భూమి పంపిణీ అన్నా ఆయనకు కిట్టదు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కూడా అందుకే నిలిచిపోయింది. ప్రభుత్వ బంజారు భూములు, సీలింగ్ పరిధి దాటిన భూములు పంచడం ఆయన ఉద్దేశం కాదు. లక్షల డబ్బులు ప్రభుత్వ ధనం ఖర్చుపెట్టి తనకి నచ్చిన వారి దగ్గిర భూమి కొని దానిని పంచడం. రాష్ట్రంలో 3 లక్షలు భూమి లేని దళితులు ఉండగా, కేవలం 6000 మందికి మాత్రమే భూమిని పంచారు, ఆపేశారు. ‘‘బీఆర్ఎస్ పాలనతో ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు?’’ అని అడిగితే రైతులు చెబుతున్నవి మరో రెండు విషయాలు. ఈ తొమ్మిదేళ్లలో ఇంకా అప్పులలో కూరుకుపోతున్నాము అన్నది మొదటిది. రెండు సార్లు ఋణ మాఫీ ప్రకటించినా, రెండు సార్లు కూడా చాలా ఆలస్యం చేసి, అనేక దఫాలుగా చేయడంతో రైతులకు బ్యాంకులో బకాయిలు అలాగే ఉండిపోయాయి, వడ్డీ పెరిగిపోయింది.
ప్రతి సంవత్సరం వచ్చే పంట రుణాలు బ్యాంకు నుండి రాకపోవడంతో ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల మీద ఆధార పడవలసి వచ్చింది. గత సంవత్సరం 25 శాతం మంది రైతులకి మాత్రమే బ్యాంకుల నుండి పంట రుణాలు వచ్చాయి. రెండో విషయం వర్షాల వలన, వరదల వలన పంట నష్టపోయినప్పుడు ప్రబుత్వం నుండి సహాయం అందకపోవడం. జాతీయ విపత్తు చట్టం కింద ఇది ప్రభుత్వ బాధ్యత అని రైతు స్వరాజ్య వేదిక వేసిన కేసులో హై కోర్టు తీర్పు చెప్పినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. అంతే కాక, దేశం మొత్తంలో పంట బీమా పథకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. అందుకే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ‘‘బంగారు తెలంగాణ’’ రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులకి ఇంకా రాలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో మాట్లాడినప్పుడు వారు చెప్పే మూడు ముఖ్యమైన కారణాలు … కౌలు రైతు కావడం, ప్రకృతి వలన పంట నష్టపోయి ఉండటం, అప్పుల భారం పెరిగి పోవడం. ఈ మూడు సమస్యలను కూడా పదేండ్ల తెలంగాణలో ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు. అంతే కాక ఈ సమస్యలను రైతు సంఘాలుగా, క్షేత్ర స్థాయి నుండి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళినప్పుడు ఖాతరు చేయక పోవడం. అన్నీ మాకే తెలుసు, ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఏ మార్పు తీసుకు రాలేము అన్నవి వాళ్ళు చెప్పిన కారణాలు. కాబట్టి అనేక విధాన లోపాలే కాకుండా ప్రజాస్వామ్య ధోరణి లేక పోవడం కేసీఆర్ ప్రభుత్వం యొక్క అతి పెద్ద లోపం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవలసినది – మరో ఐదేళ్లు ఇదే ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగు పడుతుందా? ప్రజాస్వామ్యం నిలుస్తుందా? ఇంకా ఈ దొరల పాలనను కష్టపడి సాధించిన తెలంగనాలో ఎన్నేళ్ళు భరిస్తాము?
-విస్సా కిరణ్కుమార్, రైతుల హక్కుల కార్యకర్త, తెలంగాణ ప్రజా జె.ఏ.సి.