దేశంలో భయంకరమైన ఫాసిస్టు వాతావరణం పెరుగుతుంది

రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయింది
•నాడు రాజ్యాంగాన్ని ఆమోదించని శక్తులే నేడు అధికారంలో ఉన్నారు
•రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : భయంకరమైన ఫాసిస్టు వాతావరణం ఈ దేశంలో పెరుగుతుందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు రాజ్యాంగంలో ఉన్నాయని, నేడు ఉన్న రాజకీయ శక్తులు మళ్లీ అధికారంలోకి వస్తే ఇక వచ్చే 50 ఏళ్లు ప్రజా సమస్యలపై చర్చలు జరగడం సాధ్యం కాదని అన్నారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సివిల్ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన హరగోపాల్ మాట్లాడుతూ 75 ఏళ్ల క్రితం రాజ్యాంగాన్ని ఆమోదించని శక్తులే నేడు భిన్న కారణాలవల్ల అధికారంలో ఉన్నారని అన్నారు. వాజ్పాయ్ వచ్చినప్పుడే కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిటి వేశారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ కమిటీని రద్దు చేశారని అన్నారు. కానీ నేడు వాళ్లు కోరుకున్న రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పరిస్థితిలను ఈ పదేళ్లలో కల్పించారని అన్నారు. బలమైన న్యాయ వ్యవస్థ ఉంటే అది అడ్డుపడుతుందని, బలహీనపరచాలని అన్నారు. వారికి నచ్చిన జడ్జిలను అపాయింట్ చేయడానికి ఒత్తిడి పెడుతున్నారని అన్నారు. రేపు కొత్త రాజ్యాంగాన్ని తీసుకువస్తే అడ్డుపడకుండా ఎలక్షన్ కమిషన్ తో సహా అన్ని సంస్థలను బలహీనపరిచారని అన్నారు. సోషలిజం, సెక్యులరిజం అనే వాటిని రాజ్యాంగం నుంచి తీసేసారని అన్నారు. ఒక సంవత్సరం క్రితమే కుంభమేళా సాధువుల ఆధ్వర్యంలో అలహాబాద్ లో ఒక ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని రాసి పెట్టుకున్నారని ఆరోపించారు. రాబోయే కుంభమేళా వారి కాన్స్టెంట్ అసెంబ్లీ అని, 2024లో అధికారంలోకి వస్తే దీనిని ఆమోదించాలనే ఆదేశాలు ప్రభుత్వాలకు ఇచ్చారని అన్నారు. దేశ భవిష్యత్తును ఆకాంక్షించేవారు అధికారంలోకి వస్తేనే రాజ్యాంగాన్ని కొంతమేరకు కాపాడుకోవచ్చని అన్నారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీల విషయంలో షెడ్యూల్ 5, 6, ఆర్టికల్ 17, 26, 27, 28 దాకా మైనారిటీ హక్కులు ఉన్నాయన్నారు. అన్ని రకాల అసమానతలు తగ్గించాలని రాజ్యాంగంలో రాసుందని అన్నారు. ఎటువంటి సమాజ నిర్మాణం జరగాలనే ఫ్రేమ్ వర్క్ రాజ్యాంగం మనకు ఇచ్చిందని అన్నారు. రాజ్యాంగం రాసినప్పుడు కొన్ని ప్రగతి నిరోధక శక్తులు నాగపూర్ లో ఈ రాజ్యాంగం మా రాజ్యాంగం కాదు, ఈ జాతీయ జెండా మా జెండా కాదు, ఈ జాతీయ గీతం మాది కాదని వారు స్పష్టంగా చెప్పారని, ఆ శక్తులే నేడు అధికారంలో ఉన్నాయన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులపై ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page