హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 25 : ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపబడినధి మన భారత రాజ్యాంగం అని, హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్ట్ మాజీ చైర్మన్ జస్టిస్ వామన్ రావు అన్నారు. ఈ మేరకు శనివారం అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ హక్కులపై ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ యువకులు విద్యార్థులు ప్రత్యేకంగా రాజ్యాంగం గురించి తెలుసుకొని,చదివి నిరుపేదలకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల పట్ల అవగాహన కల్పించాలని కోరారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకొని అవగాహన పొందాలన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటేశ్వర రెడ్డి ప్రసంగిస్తూ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ ని చదివి, వినిపించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. న్యాయ రంగంలో సేవలందిస్తున్న పలువురికి ‘సేవా రత్నా పురస్కార్-2023’తో న్యాయమూర్తులు మొమెంటో, శాలువా, పూల మాలలతో అవార్డు ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.