- తెరవెనుక బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు చేతులు కలిపాయి
- కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అల కాదు ‘తుఫాను’
- భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ యోగేంద్ర యాదవ్
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సామాన్యులు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని భారత్ జోడో అభియాన్ (పౌర సమాజ వేదిక) జాతీయ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. శుక్రవారం భారత్ జోడో అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘తెలంగాణ ఎన్నికలు మార్పు కోసం పౌర సమాజం పిలుపు’ అనే అంశంపై సమావేశం తెలంగాణ పీపుల్స్ జేఏసీ నేత విస్సా కిరణ్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్బంగా హాజరైన యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజల సమస్యలపై పనిచేస్తున్న ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు బీఆర్‌ఎస్, బీజేపీలకు వోటు వేయవద్దని టీపీజేఏసీ, జాగో తెలంగాణ, ముస్లిం జేఏసి వంటి వేదికల ద్వారా ప్రజలను కోరుతున్నామన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా అల మాత్రమే కాదు తుఫాను ఉందన్నారు. తెలంగాణలో 12 నియోజకవర్గాల్లో పర్యటించి విస్తృతంగా వోటర్లతో కలిసి మాట్లాడినట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలకు కూడా టోన్ సెట్ చేస్తాయన్నారు. అత్యంత శక్తివంతంగా కనిపించే నాయకులు, ప్రభుత్వాలను కూడా సామాన్య ప్రజలు దించగలరని చూపిస్తుందన్నారు. బీఆర్‌ఎస్, బిజెపి తెరవెనుక చేతులు కలిపి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పని చేస్తున్నాయన్నారు. తెలంగాణలో తాము బీజేపీ, బీఆర్‌ఎస్ రెండిరటినీ వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీఆర్‌ఎస్‌కు వోటేస్తే బీజేపీకి వేసినట్లే, బీజేపీకి వేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టే అన్నారు.
తాము ఈ సందేశాన్ని తెలంగాణ వోటర్లందరికీ ఇస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్, బిజెపిలు బహిరంగంగా విమర్శించుకుంటున్న దానిని చూసి మోసపోవొద్దని విజ్ఞప్తి చేశారు. భారత్ జోడో అభియాన్ ఒక పౌర సమాజ వేదిక, ప్రజా సంఘాల ఉమ్మడి కృషి అన్నారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, మత విద్వేషాలను ఎదుర్కొనడా నికి, సమాన హక్కులు కాపాడుకోవడానికి పనిచేస్తోం దన్నారు. 2024 లోక్‌సభ, 2023 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి దాని మిత్రపక్షాలను ఓడిరచినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుందన్నారు. వందలాది మంది సీనియర్ సామాజిక కార్యకర్తలు, ఉద్యమ నాయకులు ఈ వేదికలో భాగమయ్యారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో భారత్ జొడో అభియాన్ జాతీయ ప్రధాన కార్యదర్శులు, ప్రొఫెసర్ ఎన్.సుకుమార్, పంకజ్ పుష్కర్, జాగో తెలంగాణ నేత జాహిద్ ఖాద్రీ, అడ్వకేట్ జేఏసీ నేత బివి శేషగిరి, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కిరణ్ కుమార్ తదతరులు పాల్గొని ప్రసంగించారు.