పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 22: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎల్లంకి కళాశాల సమీపంలో గల ఎస్సార్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని, నియోజకవర్గ పరిధిలోని నలు మూలల నుండి 1,50,000కు పైగా కార్యకర్తలు సభకు హాజరు కాబోతున్నట్లు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ ఏర్పాట్ల గురించి వివరించారు. పటాన్ చెరు నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించబోతున్నట్లు తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం పట్టణం నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు హాజరు కాబోతున్నట్లు తెలిపారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో పటాన్ చెరు నియోజకవర్గాన్ని 9 వేల కోట్లతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళామని తెలిపారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు ప్రతి ఇంట్లో సంక్షేమం ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి పారదర్శక పాలన అందించామని తెలిపారు.2018 పటాన్ చెరు ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన నాలుగు హామీలను పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు.ప్రభుత్వం అందించే నిధులతోపాటు సిఎస్ఆర్, సొంత నిధులతో పాఠశాలల భవనాలు, విగ్రహాలు, గుడులు, మసీదులు, చర్చిలు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన సభకు హాజరైన సందర్భంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆర్డీవో కార్యాలయం, సబ్ రిజిస్టర్, పాలిటెక్నిక్ కళాశాల జీవోలు విడుదల కావడంతోపాటు కార్యాలయాల ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నయని తెలిపారు.ప్రతి కార్యకర్త సభకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.నందీశ్వర్ గౌడ్ పెద్దరికం కాపాడుకోండి.పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పెద్దరికం కాపాడుకోవాలని, వ్యక్తిగత దూషణలు మానుకోకపోతే ఆయనకే నష్టమని ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పద్ధతిగా పనిచేయాలని, నేను మాట్లాడటం ప్రారంభిస్తే పదాల అర్థాల కోసం డిక్షనరీలు వెతుక్కోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చని, ప్రజలు ఆదరిస్తేనే ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడతారని తెలిపారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.