తెలంగాణలో కాంగ్రెస్‌కు డీఎంకే మద్దతు

అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తామని స్టాలిన్‌ ‌పిలుపు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. తమకే వోటు వేసి గెలిపించాలంటూ వోటర్లను అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో ముఖ్య నేతలు సైతం సభలు, రోడ్‌ ‌షోలతో అభ్యర్థులకు మద్దతు కూడగడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌గాలి వీస్తున్న వేళ.. అధికారం ఛేజిక్కించుకునేందుకు ఆ పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. ఏఐసీసీ అగ్రనేతలు సైతం ప్రచారాల్లో పాల్గొంటూ అభ్యర్థుల్లో జోష్‌ ‌నింపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్రంలో సీపీఐ, వైఎస్‌ఆర్‌టీపీలతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీకి.. తాజాగా మరో పార్టీ తమ మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కాంగ్రెస్‌ ‌పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారికంగా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని డీఎంకే సానుభూతిపరులకు సూచించారు.

హస్తం పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించేలా పని చేయాలని కోరారు. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ‌నేతృత్వంలోని సర్కార్‌ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమిలో డీఎంకే భాగస్వామిగా ఉంది. తమిళనాడులోనూ డీఎంకే, కాంగ్రెస్‌ ‌పార్టీ మధ్య పొత్తు ఉంది. గత ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి మద్దతిస్తున్నట్లు స్టాలిన్‌ ‌ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు షాక్‌..: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించడంతో కేసీఆర్‌కు షాక్‌ ‌తగిలినట్లైంది. గతంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో పలు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్‌ ‌భేటీ అయ్యారు. ఆయా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోనూ సమావేశమై మద్దతు కోరారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే నిర్ణయంతో ఆయన కేసీఆర్‌ ‌వెంట లేనట్లుగా అర్థమవుతోంది. అదే సమయంలో భారత్‌ ‌రాష్ట్ర సమితి ఇటు ఇండియా కూటమిలో గానీ.. అటు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో గానీ భాగస్వామిగా లేకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page