రాజధానిలో ప్రస్తుతం ఎంఐఎం(మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలను మినహాయిస్తే.. రాష్ట్రంలో మరో 25కు పైగా నియోజకవర్గాల్లో ముస్లిం వోటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వీరు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. గులాబీ పార్టీ ఆ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ముస్లింల వోట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అత్యధికం బీఆర్ఎస్ గెలుచుకోవడమే ఇందుకు నిదర్శనం. ముస్లింలకు ప్రతినిధులుగా చెప్పుకొనే ఎంఐఎంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్‌ఎసకు కుదిరిన స్నేహమే ఆ వర్గం వోటర్లు గులాబీ పార్టీకి మద్దతుగా నిలవడానికి కారణమైంది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని.. బీఆర్‌ఎసకు వోటేస్తే బీజేపీకి వేసినట్లేననే విస్తృత ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ముస్లింల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగిందన్న ప్రచార సంకేతాలు కనిపిస్తుండడంతో ఈసారి ముస్లింలు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బిజెపి, బిఆర్ఎస్ రహస్య ఒప్పందాన్ని ముస్లింలు గమనిస్తునే ఉన్నందువల్ల ఎందరు మనః పూర్వకంగా భారాసకు ఆప్తులని చెప్పలేని పరిస్థితి.
పాతనగరానికే పరిమితం కాకుండా.. మైనారిటీల ప్రభావం ఉండే అన్ని నియోజకవ ర్గాల్లోనూ ఈసారి మజ్లిస్ అభ్యర్థులను బరిలోకి దించాలని ఒవైసీ నిర్ణయించినట్లు తొలుత ప్రచారం జరిగింది. మజ్లిసకు కంచుకోటగా ఉన్న ఏడు స్థానాల్లో సైతం గతంలోలా ఈసారి పరిస్థితి ఏకపక్షంగా లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలకు మజ్లిస్ టికెట్ నిరాకరించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ అసమ్మతి గళం వినిపిస్తున్నారు. గతంలో ఎంబీటీలో ఉన్నప్పుడు.. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఒవైసీనే ఢీకొన్న నేతగా ఈయనకు పేరొంది. ఎంఐఎం సీటు నిరాకరించడంతో తమ పార్టీ తరపున పోటీ చేయాలంటూ ఈయనను ఎంబీటి, కాంగ్రెస్ పార్టీలు ఆహ్వానిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ముంతాజ్ ఖాన్ పార్టీ మారితే.. ఆ సీటును మజ్లిస్ గెలుచుకోవడం అంత సులభం కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంఐఎం చేతిలో ఉన్న నాంపల్లిలో.. కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇస్తోంది.
2009లో నాంపల్లి నియోజకవర్గం ఏర్పాటయ్యాక మూడుసార్లూ మజ్లిస్ పార్టీయే ఇక్కడ గెలుపొందగా.. మూడుసార్లూ మజ్లిసకు గట్టిపోటీ ఇచ్చిన సమీప ప్రత్యర్థిగా ఫిరోజ్‌ఖాన్ నిలిచారు. ఓటమి ఎదురైనా ఫిరోజ్‌ఖాన్ నిత్యం ప్రజల్లోనే ఉంటుండడంతో ఈసారి కాంగ్రెస్ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. మరోవైపు.. సిటింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌కు ఎంఐఎం ఈసారి యాకుత్‌పుర టికెట్ ఇచ్చి.. నాంపల్లి నుంచి మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్‌ను బరిలోకి దించుతోంది. అలాగే.. బహదుర్పురలోనూ సిటింగ్ ఎమ్మెల్యేను మార్చాలని ఎంఐఎం భావిస్తోంది. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ స్థానాల్లోనూ పోటీచేస్తామని చెప్పినా… గతంలో లేని విధంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో ఈసారి సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడమే ఆ పార్టీకి సవాల్‌గా మారింది. దీంతో.. ఇతర జిల్లాల్లోనూ పోటీచేస్తామని తొలుత ప్రకటించిన మజ్లిస్ వెనక్కితగ్గింది. ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చార్మినార్, బహదూర్‌పుర, యాకుత్‌పుర, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో 50-85 శాతం మైనారిటీ వోటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల వోటర్లలో 33 శాతం ముస్లింలు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గోషామహల్, సనత్‌నగర్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్-కంటోన్మెంట్, అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ 20-25 శాతం మైనారిటీ వోటర్లు ఉన్నారు. మహేశ్వరం, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలోనూ గణనీయంగా ఉన్నారు. ఇతర జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో 15-20 శాతం ముస్లిం వోటర్లున్నారు. వారి వోట్లు ఎవరికి ఎక్కువగా పడితే వారిదే విజయం. మారిన పరిణామాల నేపథ్యంలో ఆ వోట్లు తమకే పడతాయని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలకు మిత్రులుగా కలసిఉన్న కృతజ్ఞత ముస్లింలు ఇంకా మరచిపోలేదని, తెలుగు దేశం ఉనికి లేకపోవడం తో మౌనంగా ఉన్నారని, అయితే పదేళ్ళుగా విపక్షంలో ఉన్నా.. అంతకు ముందు కాంగ్రెస్ తో మమేకమై ఉన్న సీనియర్ ముస్లిం నేతల సంఖ్య తగ్గలేదని అంటున్నారు.
తెలంగాణలోని 12.7% వోటర్లు ఉన్న ముస్లింలు నవంబర్ 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 40% రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక- ప్రకారం , హైదరాబాద్‌లోనే 1.75 పైగా మిలియన్ల ముస్లింలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ముస్లిం జనాభాలో 44.5%. నగరంలో 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అందులో 10 స్థానాల్లో ముస్లిం వోటర్లు ప్రభావం చూపుతారు.
రెండు దశాబ్దాలుగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదు ల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కి కోటగా ఉన్న హైదరాబాద్ పాతబస్తీలో చాలా మంది ముస్లింలు నివసిస్తున్నారు. పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ నిలకడగా విజయం సాధిస్తూ వస్తోంది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) హైదరాబాద్‌లోని ముస్లిం కోటలను మించి తన ప్రభావాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. హిందూ వోట్ల పోలరైజేషన్ వల్ల తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభివృద్ధి చెందుతుందనే భయంతో ఎంఐఎం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజనకు ఎంఐఎం బలమైన ప్రత్యర్థి. అయితే కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారత రాజ్య సమితి (బిఆర్ఎస్) బలపడటంతో ఎంఐఎం తెలంగాణ వ్యతిరేక వైఖరిని వదులుకుని బిఆర్ఎస్కు చేరువైంది. ఎం ఐ ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వెలుపల తమ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాలలో బిఆర్ఎస్ను ఎంచుకోవాలని గతంలో ముస్లిం వోటర్లకు విజ్ఞప్తి చేశారు. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)తో ‘‘స్నేహపూర్వకంగా’’ ఉన్న ఎంఐఎం, వ్యూహాత్మక వైఖరి ద్వారా సీట్లు గెలుచుకోవడంలో సహాయపడుతుందని, తద్వారా కీలకమైన ముస్లిం వోట్లను కాంగ్రెస్‌కు దూరం చేస్తుందని భావిస్తున్నారు, ఆశిస్తున్నారు. కానీ ఎంతవరకూ సఫలికృతమౌతారన్నది సందేహమే.. అదే జరిగితే, మైనారిటీ వోట్లు తరాలుగా నడుస్తున్న దారి మారినట్లే.
గత నాలుగున్నరేళ్లలో కాంగ్రెస్ విశ్వసనీయమైన ప్రతిపక్షంగా నిరూపించు కోలేకపోయిందని, ఎంఐఎం సీనియర్ నాయకులు భావించారు . హైదరాబాద్ వెలుపలి స్థానాల్లో బిఆర్ఎస్ గెలుపొందేం దుకు తమ పార్టీ కృషి చేస్తుందని సన్నిహిత వర్గాలకు తెలీపారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఏమి చేసింది, కేటాయించిన నిధులను పంపిణీ చేసేందుకు ప్రయత్నించారా? అని ప్రశ్నించిన రోజులున్నాయి. ముస్లిం వోటర్లు మెజారిటీ వోటింగ్ ధోరణికి వ్యతిరేకంగా లేరు కనుకనే ‘‘రాష్ట్రంలొ ముస్లిం వోటర్లపై ఒవైసీ పార్టీ గట్టి పట్టు సాధించింది. ఇది కాంగ్రెస్, మిత్రపక్షాల కంటే కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్కు ప్రయోజనంగా మారిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎంఐఎంకు చెందిన ఏడుగురు, టీఆర్ఎస్కు చెందిన ఒకరు మొత్తం ఎనిమిది మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడంలో విఫలమైందని, ముస్లింలకు సురక్షితమైన వాతావరణాన్ని బిఆర్ఎస్ అందించగలిగిందని, పెద్ద ప్రయోజనం ఏంటంటే ముఖ్యమంత్రి వర్గానికి ముస్లింలు స్నేహపూర్వకంగా ఉండడం, ఆయన ఉర్దూలో అనర్గళంగా మాట్లాడటం, ముస్లిం వోటర్లలో బిఆర్ఎస్ పట్ల అభిమానానికి కారణమంటున్నారు. ముస్లింల కోసం ప్రత్యేకంగా 200 రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేయడం, అక్కడ వారికి 12వ తరగతి వరకు ఉచిత విద్య, ఆహారం, దుస్తులు అందించడం బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఒనగూర్చిన పెద్ద ప్రయోజనమనే భావన పాతుకు పోయింది. అసెంబ్లీలోని 119 సీట్లలో, (కోర్ సిటీ, పరిసర ప్రాంతాలు) 24 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ కిందకు వస్తాయి, వీటిలో ఏడు ఎంఐఎం కంచుకోటలుగా ఉన్నాయి. ముస్లిం వోటర్లు నిజంగా కీలక పాత్ర పోషిస్తారని, ఆ వర్గానికి 12% రిజర్వేషన్లు కల్పించడంలో టీఆర్ఎస్ వైఫల్యం ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక వ్యక్తి అభిప్రాయ పడుతున్నారు. ఈసారి ఏఐఎంఐఎం ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. గత ఎన్నికల్లో 119 స్థానాల్లో సంఖ్యా బలం పెంచుకున్న బిఆర్ఎస్కు వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలంగాణ జనసమితి కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. మనుగడ లేకున్నా తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు అంతర్గతంగా బిఆర్ఎస్ కు వ్యతిరేకమౌతాయని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నమ్మకం. ఎంఐఎం కేవలం హైదరాబాద్ లోని ఏడెనిమిది స్థానాల్లోనే బలమైన వర్గమని, ఇతర జిల్లాల్లోని ముస్లింలు స్థానికంగా అనుకూలమార్గం చూసుకుంటారని అనేకమందికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో మూడు దశాబ్దాలకు పైగా ఏర్పడిన అవినాభావ సంబంధం త్వరగా తెగేదికాదని వాదన ఉంది. బిఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఈ ఎన్నికలలో నిర్ణయాత్మక అంశం అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం వోట్లను బిఆర్ఎస్ అన్నిరకాలా కృషి చేస్తున్నది. ఫలితంగా బిజెపి వ్యతిరేక వోటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏకీకృతం కాగలవా అని అనుమానం ఉంది. కెసిఆర్ , కెటిఆర్ కేవలం ఒవైసీ సోదరులకే అందుబాటులో ఉంటారని, మిగిలిన ముస్లిం పెద్దలకు ప్రాధాన్యం ఇవ్వరని స్థిర అభిప్రాయం. కెసిఆర్ విడుదల చేసిన ఎన్నికల హామీల పట్ల ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి, అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తంచేస్తూ భారాసా మానిఫెస్టో మైనారిటీల్లో అట్టడుగు వర్గాలకు మేలు చేస్తుందాని కితాబునివ్వడం గమనార్హం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, ఇతర విధానాలవలన తెలంగాణలో బతుకుభారమై అనేక ఇబ్బందులు పడుతున్న పేదవర్గాలకు భారాస ఎన్నికల ప్రణాళిక ఎంతో సహాయకారిగా ఉంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. దేశం ఎదుర్కోంటున్న అనేక సవాళ్ళను, ఆర్థిక కుంగుబాటుతనాన్ని ధీటుగా ఎదుర్కొనే రీతిలో కెసిఆర్ మానిఫెస్టొ ధైర్యం ఇస్తున్నదని అనడం ఆయన భారాస కు మద్దతుగా నిలిచారని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలలో భారాస అత్యధిక ఆధిక్యతతో గెలుపొంది హాట్రిక్ సాధిస్తుందన్న విశ్వాసం ప్రకటించారు. టీఆర్ఎస్కు 80 సీట్లు పిగా గెలుస్తామన్న విశ్వాసం కూడా ఎంఐఎం పరోక్ష మద్దతుతోనే వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి భారాస తెలంగాణ ప్రజల విశ్వాసం పొందిందని, విద్యుత్తు, మంచినీరు సమృద్దిగా సరఫరా జరగడం వలన ప్రజలకు ఏ ఇబ్బందులూ లేవనీ, అంతేగాక జంట నగరాలు ఎటువంటి అవాంచిత సంఘటనలు, మత ఘర్షణలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవనం సాగించడం హర్షదాయకమంటూ రాష్ట్రం సర్వతో ముఖాభి వృద్ధిచెందుతున్నదని ప్రశంసించడం గమనిస్తే ఎంఐఎం కెసిఆర్ కు అండగా ఉంటుందని స్పష్టమౌతున్నది. టీఆర్ఎస్ హయాంలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు విశ్వాసంతో ఉన్నారు. తెలంగాణలో పదేళ్ళుగా మత విద్వేష సంఘటన కానీ, కర్ఫ్యూ విధించిన రోజుకానీ లేదని, కాంగ్రెస్ హయాంలో నిత్యం కర్ఫ్యూలు ఉండే హైదరాబాద్ పాతబస్తీ ఇప్పుడు ప్రశాంతంగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. ముస్లింలు బిఆర్ఎస్తో సంతోషంగా ఉన్నారని అభిప్రాయం ప్రజలలో ప్రగాఢంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా ముస్లింలకు అనేక అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని రేవంత్ మైనార్టీ డిక్లరేషన్ లో గుర్తు చెసినా ఎంఐఎం నుంచీ స్పందన లేదు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు కుల గణనను చేపట్టి.. ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనార్టీలతో సహా అర్హులందరికీ న్యాయమైన రిజర్వేషన్లు మైనార్టీల సంక్షేమ బడ్జెట్‌ను రూ.4,000 కోట్లకు పెంచడంతో పాటు ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్, విద్య, ఉపాధి ఈక్విటీకి నిబద్ధత, అబ్దుల్ కలాం తౌఫా-ఎ-తలీమ్ పథకం అమలు చేస్తామన్నారు.ఎంఫిల్ చేసిన మైనార్టీ యువతకు రూ.5 లక్షల సాయం, పీహెచ్డీ, పీజీ చేసిన మైనార్టీ యువతకు రూ.లక్ష సాయం, సిక్కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ, మైనార్టీ సంస్థల్లో ఖాలీల భర్తీకి హామీ, ఉర్దూ మీడియం టీచర్ల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ అన్ని మతాల పూజారులకు నెలకు రూ.పది నుంచి రూ.12 వేల గౌరవ వేతనం, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి కాంగ్రెస్ ప్రకటించింది. ఇళ్లులేని మైనార్టీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం, ఇళ్లు లేని మైనార్టీ కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, మైనార్టీలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం మతపరమైన హక్కులు, సంస్కృతి రక్షణ, నిరుద్యోగ మైనార్టీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడం కోసం సంవత్సరానికి 1,000 కోట్లు, పాత బస్తీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాంటి కీలక హామీలున్నా ఎంఐఎం నుంచీ సానుకూల సంకేతాలు కనబడలేదు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని అమలు చేయడంలో టీఆర్ఎస్ జాప్యం చేసిందని కాంగ్రెస్ ఎత్తి చూపుతోంది. ‘‘ముస్లింలకు 4% కోటాను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 12 శాతానికి పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదని తెలంగాణ పీసీసీ నేతలు గుర్తు చేస్తున్నారు.
తాజా సమాచారం మేరకు పోటీలో ఉన్న ఎంఐఎం అభ్యర్థులు
మలక్‌పేట – అహ్మద్ బలాలా. జూబ్లీ హిల్స్ ు మహమ్మద్ రషీద్ ఫరారుద్దిన్. నాంపల్లి-మాజిద్ హుస్సేన్. కార్వాన్ -కౌసర్ మొహియుద్దీన్, చార్మినార్ ..జుల్ఫీకర్, చాంద్రాయణ్ గుట్ట -అక్బరుద్దిన్ ఒవైసి, యాకుత్‌పుర- జాఫర్ హుస్సేన్.
– నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్, 98481 28215