హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది
కెసిఆర్ తెలంగాణను దేశానికే మోడల్‌గా నిలిపారు
చిదంబరం వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి హరీశ్ రావు ఫైర్..
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం..దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది నిజం కాదా అని అన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది..చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు ..చిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారంటూ దుయ్యబట్టారు. అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారని హరీష్ రావు అన్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందనేది గ్రహిస్తే మంచిదన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిదన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారన్నారు.
కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారని, చిదంబరంకు దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ సాధించింది కేసీఆర్, సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కేసీఆర్ అని, ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వొచ్చి దుష్ప్రచారం చేసినా…యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నరని, రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీని దీవించబోతున్నరని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు.