•చనాకా-కొరాటాతో పిప్పల్ కోట్ రిజర్వాయర్‌కు నీళ్లు
•నాడు అదిలాబాద్ జిల్లాలో వర్షాకాలం వొస్తే మన్యం రోగాల బారిన పడేది
•నేడు మిషన్ భగీరథలో అంటు రోగాలతో చావులు లేకుండా చేసుకున్నం
•బోథ్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : మనదేశంలో ఇంకా రాజకీయ పరిణతి రావాల్సిన అవసరం ఉందని, ఎన్నికల్లో ప్రజలు గెలువాలంటే.. మీరు మంచి చెడ్డా అన్నీ ఆలోచించి వోటేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా అనిల్ జాదవ్ ఉన్నట్టుగానే వేరే పార్టీలకూ ఉంటారని,. అభ్యర్థుల మంచీ చెడ్డతో పాటుగా వారి వెనుకున్న పార్టీల గత చరిత్ర కూడా చూడాలని, ఆ విషయాలను బీఆర్ ఎస్ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో చర్చ పెట్టి, బీఆర్ఎస్ సాధించిన విజయా లను చెప్పాల న్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని, గులాబీ జెండా ఎగిరిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని అన్నారు. గురువారం బోథ్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. .మంచిగున్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏండ్లు తెలంగాణ ప్రజలు అరిగోస పడటానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. 1969లో తెలంగాణ ఉద్యమమొస్తే 400 మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టల్లా కాల్చి చంపిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
2004లో తెలంగాణ ఇస్తమని చెప్పి మనతో పొత్తుపెట్టుకొని, అధికారంలోకి రాగానే ఇవ్వకుండా 15 ఏండ్లు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలం గాణ ఇవ్వకుండా దోఖా చేసి, టీఆర్ఎస్ పార్టీనే చీల్చాలని కుట్ర పన్నింది. చివరికి ‘తెలంగాణ వొచ్చుడో..కేసీఆర్ సచ్చుడో’ అని నేను దీక్షబూనితే దిగొచ్చిండ్రు..అప్పటికీ తెలంగాణ ఇవ్వకుండా మరో ఏడాదిన్నర దోఖా చేసే ప్రయత్నం చేసిండ్రు. దేశంలో 33 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి, మనం ఉప్పెనలా విజృంభిస్తే తెలంగాణ వొచ్చింది. బోథ్ ప్రాంతంలో నాడు రైతులు బోర్లేసి, పత్తి పంటలతో అప్పుల పాలై చాలా బాధలు పడేది. నాడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన చెరువుల పూడికలు తీయలేదు. నేడు ఇక్కడ 70కి పైగా చెరువుల పూడికలు తీసుకొని, 8 కి పైగా చెరువులు కట్టుకొంటే భూగర్భ జలాలు పైకొచ్చినయ్. చనాక-కొరాట పూర్తవుతున్నది. దానితో పిప్పల్ కోట్ రిజర్వాయర్ కు నీళ్లు తీసుకొస్తే మనకు చాలా లాభం జరుగుతుంది…అని అన్నారు. ఇంకా కెసిఆర్ మాట్లాడుతూ…ఆ పని కూడా నేను చేపిస్తా. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా చూడండని మనవి చేస్తున్నా.. 58 ఏండ్లు మనల్ని అరిగోస పెట్టి, కరెంటు సరిగ్గా ఇయ్యక, మంచినీళ్లు లేక అదిలాబాద్ చరిత్ర నాడు ఎట్లుండె. వర్షాకాలం వచ్చిందంటే నాడు అదిలాబాద్ లో..మంచం ఎక్కిన మన్యం’ అంటూ అంటురోగాల గురించి పేపర్లలో పెద్ద పెద్ద హెడ్ లైన్లతో వార్తలు వొచ్చేవి.
కాంగ్రెస్ హయాంలో అదిలాబాద్ అంటురోగాలతో సతమత మవుతుంటే మన మంతా ఏడ్చేది. ఇవ్వాల బీఆర్ఎస్ ప్రభు త్వంలో మిషన్ భగీరథ ద్వారా అంటురోగాల చావులు లేకుండా చేసుకున్నం. ప్రతి ఇళ్లూ, గుడిసెలకు కూడా మంచినీళ్లు అందేలా మన ప్రభుత్వం చేసింది…అని వివరిం చారు. కాంగ్రెస్ రాజ్యంలో మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంటు లకూ బాధలే. కమీషన్ ఏజెంట్ల దగ్గర రైతులు అప్పులు తీసుకొని ఆగమైండ్రు. తెలంగాణ వొచ్చినంక మన ప్రభుత్వంలో రైతులు బాగుండాలని వ్యవసాయ స్థిరీకరణ మొదట చేసుకున్నం. వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు, రైతు బీమా, రైతులు పండించిన పంటను మొత్తం ప్రభుత్వమే కొంటున్నది. తెలంగాణకు పెద్ద ప్రమాదం రాబోతున్నది.. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా చెప్పడం నా బాధ్యత. పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘రైతు బంధు’ వేస్ట్ అంటడు. ప్రజలేమో కావాలని కోరుతున్నరు.. కేసీఆర్ ప్రజలు కోరుకున్నదే చేస్తడు. రైతు బంధు’ రావాలంటే అనిల్ జాదవ్ గెలువాలె..రైతు బంధును రూ.16 వేలకు పెంచుకుంటాం. పిసిసి అధ్యక్షుడే 3 గంటల కరెంటు సాలు అంటడు. మరి 3 గంటల కరెంటుతో పొలం మొత్తం పారుతదా? 24 గంటల కరెంటు ఉండాలంటే బోథ్‌లో అనిల్ జాదవ్ గెలువాలె. రైతుల భూములు ఎవరూ గుంజుకోకుండా, రైతుల రక్షణకు ధరణి’ తెచ్చినం. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహూల్ గాంధీయేమో కాంగ్రెస్ ప్రభుత్వమొస్తే ధరణి’ని తీసి బంగాళా ఖాతంలో వేస్తామంటున్నడు.ధరణి’ తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎట్లా రావాలె?.. మళ్లీ దళారులు, పైరవీకారుల రాజ్యమే కాంగ్రెస్ తేవాలని చూస్తున్నది.
మీరెక్కడికి పోకుండా, మీ కడుపులో చల్ల కదలకుండా, మీ గడప దాటకుండా డబ్బులు మీ ఖాతాకు డైరెక్ట్ గా వస్తుంటే వాడుకుం టున్నరు. కరెంటు 3 గంటలే ఇస్తం..ధరణి తీసేస్తం..రైతుబంధు వేస్ట్..అని కాంగ్రేసోల్లు బహిరంగంగానే చెబుతున్నరు. పొరపాటున కాంగ్రెస్ కు వోటేస్తే..మేం చెప్పినంక కూడా మాకే ప్రజలు ఓట్లేసిండ్రని కాంగ్రేసోల్లు తీసి అవతల పడేస్తరు. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచినీళ్లు తెచ్చినం.. చెరువులు బాగు చేసినం.. బోథ్ లో దాదాపు 10 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలను ఇచ్చాం. బీఆర్ఎస్ పాలనలో గ్రామం పంచా యతీలు అద్భుతంగా ఉన్నయ్. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నయ్. బోథ్ నియోజకవర్గం ముఖ్రా కె గ్రామం నుంచి మీనాక్షి జాతీయస్థాయిలో అవార్డు తెచ్చి తెలంగాణను గర్వపడేలా చేసింది. అనిల్ జాదవ్ ను గెలిపించండి..బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేస్తాను. బోథ్ లో డిగ్రీ కాలేజీ, కోల్డ్ స్టొరేజిని కూడా అడుగుతున్నరు. వాటన్నింటినీ తప్పకుండా ఏర్పాటు చేస్తాను. గిరిజనేతరుల పోడు భూములపై కేంద్రం మోకాలడ్డుతున్నది. వచ్చే టర్మ్ లో కేంద్రంతో కొట్లాడైనా వాళ్లకు పట్టాలను ఇప్పిస్తాం. మోదీ ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇయ్యలేదు. అలాగే నవోదయ పాఠశాల కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. మరి నలుగురు బీజేపీ ఎంపీలు గడ్డికో స్తాం డ్రా.. చేతనైత లేదా.. ఒక్క మెడికల్ కాలేజీ గానీ, ఒక్క నవోదయ స్కూల్ గానీ ఇయ్యని బీజేపీకి ఒక్క వోటు కూడా వేయొద్దు….అని కెసిఆర్ కోరారు.
కుట్టి రిజర్వాయర్’ను కట్టించే బాధ్యత తనదేనని, కేసీఆర్ బతికున్నంత వరకు తెలంగాణ సెక్యులర్ గానే ఉంటదని కెసిఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను వోటు బ్యాంకుగానే చూసిందని, గత కాంగ్రెస్ పాలనలో మైనార్టీల కోసం 2 వేల కోట్లు ఖర్చు చేస్తే.. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12,000 కోట్లను ఖర్చు చేసామని కెసిఆర్ తెలిపారు. ప్రజలల్లో కలిసుండేవాడు, అందరితో బాగా ప్రేమగా ఉండే అనిల్ జాదవ్‌ను కారు గుర్తుకు వోటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కెసిఆర్ కోరారు.