మధుమేహ చికిత్సకు చేరువ!

 నేడు ప్రపంచ మధుమేహ దినం…
భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధాని అంటరు. ప్రపంచంలోని మధుమేహ వ్యాధి గ్రస్తులలో 17 శాతం భారత్‌ లోనే ఉన్నరు.
భారతదేశంలో 10 కోట్ల పైచిలుకు వయోజనులు మధుమేహంతో బాధ పడుతున్నరు. 13 కోట్లకు పైగా వ్యాధి సమీప దశలో ఉన్నరు. వ్యాధి గ్రస్థులలో సగం మందికి తమకు జబ్బు ఉన్నట్లు తెలియదు. సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే  భవిష్యత్తులో అవాంతరాలను నివారించవచ్చు. మధుమేహం ఉన్నవారిలో గుండెపోటు, పక్షవాతం వచ్చే ఆస్కారం ఎక్కువ. అధిక రక్త పీడనం కూడా తోడైతే ఈ ప్రమాదం మరింత ఎక్కువ! మధుమేహుల పాదాలలో రక్తప్రసరణ తగ్గి, నాడీ కణాలు దెబ్బతినడం వల్ల పుండ్లు, పాదం తొలగింపునకు దారి తీస్తున్నది. కంటి చూపు మందగిస్తున్నది. మూత్ర పిండాలు పనితనం కోల్పోతున్నయి. తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు శరీరంలోని అన్ని అవయవాల మీద మధుమేహం తన దుష్ప్రభావం చూపగలదు.

మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. ఇది రెండు రకాలు. పిల్లలలో వచ్చేది మొదటి రకం. వయోజనులలో వచ్చేది రెండవ రకం. మన అందరిలో తిన్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌ గా మారుతుంది. గ్లూకోజ్‌ శరీర కణాలలో శోషించి శక్తిగా పరిణమిస్తుంది. ఇందుకు ప్రధాన పాత్ర పోషించేది ఇన్సులిన్‌ అనే హార్మోన్‌. ఇన్సులిన్‌ క్లోమగ్రంధిలో ఉత్పత్తి అయితది. మొదటి రకం వారికి ఇన్సులిన్‌ ఉత్పత్తియే జరుగదు. రెండవ రకంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ ను శరీరం వినియోగించుకో లేకపోతది. మొదటి దానికి జన్యు కారణమైతే, రెండవ దానికి జన్యు కారణాలతో పాటు జీవన శైలి ప్రధాన హేతువు. గర్భవతులలో, స్టెరాయిడ్‌ ఔషధ వినియోగం చేస్తున్న వారిలోనూ మధుమేహం రావచ్చు.

వ్యాధిగ్రస్థులలో గ్లూకోజ్‌ శక్తిగా మారకుండా రక్తంలోనే ఉన్నందువల్ల దానిని విసర్జించటానికి మూత్రం ఎక్కువ విడుదల అయితది. దానితో దాహం, కణజాలంలో శక్తి సరిపోనందున ఆకలి ఎక్కువ అయితయి. మధుమేహ నియంత్రణకు ఔషధ చికిత్సతో పాటు, ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పులు అవసరం. మధుమేహ వ్యాధి ప్రాధాన్యతను గుర్తించిన ఇంటర్నేషనల్‌ డయాబెటిక్‌ ఫెడరేషన్‌ ఏటా మధుమేహ దినం పాటించాలని భావించింది. ఇన్సులిన్‌ ను కనుగొన్న ఫ్రెడరిక్‌ బాంటింగ్‌ జన్మతిథి 14 నవంబర్‌ నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో 1991 నుంచి పాటిస్తున్నరు. ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశం 2007 లో మధుమేహ దినం పాటించటానికి తీర్మానం ఆమోదించింది. దాని వల్ల ఐరాస సభ్య సంస్థలు అన్నీ బాధ్యత వహిస్తున్నయి. నీలి ఉంగరంను మధుమేహానికి చిహ్నంగ తీసుకొన్నరు. ప్రజలను చైతన్యం చేయటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఒక నినాదం ఇస్తది. ఈ ఏటి నినాదం ‘‘మధుమేహ చికిత్సకు చేరువ’’ (ఆక్సెస్‌ టు డయాబెటిస్‌ కేర్‌).

మధుమేహ చికిత్సలో విప్లవాత్మక మార్పు 1922 నాటి ఇన్సులిన్‌ ఆవిష్కరణ. అది జరిగి ఇప్పటికి శతాబ్ది దాటినా చికిత్స ఇంకా సామాన్యునికి చేరువ కావలసి ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు భారత ప్రభుత్వం అసంక్రామిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం క్రింద మందులు ఉచితంగా అందిస్తున్నది. జన ఔషధి పరియోజనలో ఇన్సులిన్‌ ను తగ్గింపు ధరలకు అందిస్తున్నది.
ఫార్మసీ పరిశోధకులు మధుమేహ చికిత్సలో గొప్ప పురోగతి సాధిస్తున్నరు. హైదరాబాద్‌ కు చెందిన నీడిల్‌ ఫ్రీ టెక్నాలజీస్‌ సంస్థ నోటి ద్వారా ఇచ్చే ఇన్సులిన్‌ (ఓజులిన్‌) తో క్లినికల్‌ ట్రయల్స్‌ కు అనుమతి పొందింది. అది విజయవంతం అయితే ఇంజెక్షన్‌ బాధ నుంచి విముక్తి లభించగలదు.
మధుమేహం నిరంతరం నియంత్రణలో ఉంచుకొన వలసిన వ్యాధి. కనుక, వ్యాధిగ్రస్తులు నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా ఔషధాలు వాడుకొన వలసి ఉంటది. దీని వల్ల భవిష్యత్తు అవాంతరాలను నివారించ వచ్చు. వారి జీవితంలో నాణ్యతను పెంపొందించ వచ్చు. ఈ ప్రక్రియలో ఫార్మసిస్ట్‌ పాత్ర ముఖ్యమైనది. విదేశాలలో ఫార్మసిస్ట్‌ ల సేవలు వినియోగించుకొని సత్ఫలితాలు పొందుతున్నరు. వ్యాధిని ముందుగా గుర్తించాలన్నా, ఔషధాలు చేరువ కావాలన్నా, చికిత్స సమర్థవంతంగా జరుగాలన్నా, మన దేశంలో ఫార్మసిస్ట్‌ లకు ‘‘మధుమేహ విద్య – యాజమాన్యం’’లో ప్రత్యేక శిక్షణ అందించాలె. అసంక్రామిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో ఫార్మసిస్ట్‌ లను నియామకం చేయాలె.

డా. రాపోలు సత్యనారాయణ
ఫోన్‌: 9440163211
(ఇండియన్‌ ఫార్మస్యూటికల్‌ అసోసియేషన్‌
జీవితకాల సభ్యుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page