పాలకుల వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి?
ప్రజల ఆస్తులను వారికే వినియోగించాలి
సంపన్న రాష్టంలో పేదలు ఎందుకు పెరుగుతున్నట్లు
మేథావులు, విద్యావంతులు గతం కన్నా ఎక్కువగా ప్రజలను చైతన్యం చేయాలి
పాలకుల దుర్మార్గాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకుండాలి
పదేళ్ల తెలంగాణపై సదస్సులో రిటైర్డ్ ‌న్యాయమూర్తి జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి, హరగోపాల్‌, ‌పాల్గొన్న పలువురు మేథావులు

హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌నిజాం పాలనలో భూముల పట్ల స్పష్టమైన విధానం ఉండేదని, రాజు తన స్వంత భూములపై (సర్ఫే కాస్‌) ఎవరైనా కోర్టులో గెలిస్తే అక్కడితో వొదిలి వేయాలని, అదే ఒక్క గజం ప్రభుత్వ భూమి ఓడిపోయినా ఉన్నత న్యాయ స్థానం వరకు పోరాటం చేయాలనే నిబంధన ఉండేద న్నారు. అలాంటి తెలంగాణలో నేడు పాలకులే ప్రభుత్వ భూమిని వారి అనుయాయులకు కట్టబెడుతున్నారని సుప్రీమ్‌ ‌కోర్టు రిటైర్డ్ ‌న్యాయమూర్తి జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ పీపుల్స్ ‌జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో పదేళ్ల తెలంగాణ-ప్రజల ఆకాంక్షలు-కర్తవ్యాలు అన్న అంశంపై ప్రొఫెసర్‌ ‌కూరపాటి వెంకట నారాయణ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…హైదరాబాద్‌ ‌నగరంలో485 చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అయ్యాయని, అలా అన్యాక్రాంతమైన చెరువుల పట్ల గడిచిన 10 ఏండ్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు లేవని, సమైక్య రాష్ట్రం అంతమొందేవరకు అన్యాక్రాంతమైన భూములు ఎన్ని? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్యాక్రాంతమైన భూములెన్ని? సంపద ఎవరి చేతి నుండి ఎవరి చేతిలోకి వెళ్లేయో సమీక్ష జరపాలన్నారు. ఆత్మగౌరవం ఎవరికి కావాలి? ఆత్మగౌరవ భవనాలు ఎవరికి ఇవ్వాలని వారి స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను అప్పనంగా ఉన్నత వర్గాలకు అప్పజెప్పడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనన్నారు.

సంపన్న రాష్ట్రమని, మిగులు బడ్జెట్‌ ఉన్నరాష్ట్రమని చెపుతూనే ఇంకా తెల్ల రేషన్‌ ‌కార్డులు ఎందుకు పెంచుతున్నట్లు అని ప్రశ్నించారు. 50 లక్షల పెన్షన్లు వారు ఇస్తే మేము రెండున్నర కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని చెబుతున్న పాలకులు రాష్ట్ర సంపద ఏమవుతున్నట్లో చెప్పాలన్నారు. పాలకులు ఇవ్వడం ఎంటి? ప్రజలు తీసుకోవడం ఎంటి? ప్రజాస్వామ్య విలువలు ఎటుపోతున్నట్లు? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో నడవాల్సిన పాలన ఎటుపోతున్నట్లు? తెలంగాణలో స్వేచ్ఛా, సమానత్వం, ప్రజల ఔన్నత్యం అనేవి ఎక్కడ పోతున్నాయి? భూములు, ఆస్తులు ప్రభుత్వానివి కావని, అవి ప్రజలవని అందుకే వాటిని పబ్లిక్‌ ‌ప్రాపర్టీ అంటారని, ప్రజల ఆస్తిని ప్రజల కోసం ఉపయోగించాలన్నారు. నాడు నిజాం వ్యతిరేక పోరాటం ఎందుకు జరిగింది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఎందు కోసం జరిగింది? తెలంగాణ అస్తిత్వం కోసం, సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం మాట్లాడకుండా ఎదో కొన్ని సంక్షేమ పథకాల గూర్చి ప్రజలు ఎదురు చూడడం, వాటిని ఇస్తున్న పాలకులు వాటినే గొప్పగా చెప్పుకోవడం తెలంగాణలో అలవాటైందన్నారు. తెలంగాణ మేధావి వర్గం ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు అన్నారు. ప్రశ్నించే శక్తి, పోరాట పటిమ ఉన్న తెలంగాణలో భజన పాలన కొనసాగుతుందని, భజన పాలన, భజన సంస్కృతి తెలంగాణది కాదని, ఇలాంటి భజన పాలన కొనసాగితే భవిష్యత్‌ ‌చాలా ప్రమాదంగా మారనుందని,  మేధావులు, విద్యావంతులు గతం కన్నా ఎక్కువగా ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.  నేటి తెలంగాణ స్థితిలో మేధావులు, పౌర సమాజం ఏమి చేయాలో ఆలోచన చేసి ప్రజలకు సరైన దిశా నిర్దేశం చేయాలన్నారు.

సదస్సులో ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌మాట్లాడుతూ న్యాయం మీద నమ్మకముండి న్యాయమూర్తుల మీద నమ్మకం కోల్పోతున్న నేటి రోజుల్లో జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి లాంటి వాళ్ళు చాలా అరుదని, సమాజ హితం కోసం న్యాయవాద వృత్తిలో నిబద్ధతతో ప్రజలను చైతన్యం చేస్తున్న జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి తెలంగాణ ప్రజలను జాగృతం చేసే సమావేశానికి హాజరవ్వడం చాలా సంతోషకరమన్నారు. విద్యార్థి దశ నుండి యూనివర్సిటీలో ప్రజల పక్షాన, ప్రగతిశీల భావాలతో ఎదిగిన ప్రొఫెసర్‌ ‌కూరపాటి వెంకటనారాయణ నేటికి ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితమైన విశ్లేషణలు వ్రాయమే కాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో ఉద్యమాలు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అణచివేతపై ప్రతిఘటన చేసే బావాలు ప్రజలకు ఉండాలని, పాలకుల దుర్మార్గాలపై ప్రశించే హక్కు ప్రజలకు ఉండాలన్నారు. తెలంగా ణలో ఆకాంక్షలు నెరవేరని క్రమంలో నిరసన తెలిపే స్థలాలు కూడా లేకుండా చేసిన దుర్మార్గ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న యువత వారు చనిపోతూ సూసైడ్‌ ‌నోటు లో వారి ఆకాంక్షలు వ్రాసారన్నారు. ఆ ఆకాంక్షలు నెరవేరని తరుణంలో ప్రజలుగా మనం ఆలోచన చేయాలన్నారు. ఉద్యమించే ప్రజాస్వామ్య పరిస్థితులు లేని నిరంకుశ బిఆర్‌ఎస్‌ ‌పాలనను అంతం చేయాలని పిలుపునచ్చారు. ప్రస్తుతం మనం పాలనను మార్చిన కూడా ప్రజల కోసం ఉద్యమకారులు నిరంత రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ పీపుల్స్ ‌జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ ఎన్నికల కోసమే మాట్లాడి ఊరుకోదని పాలన మారిన తర్వాత కూడా సామాజిక, ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడుతుందని అన్నారు.

తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని, అందే శ్రీ లాంటి సాహిత్య కారులను, కళాకారులను, ప్రజల హక్కులను కాపాడుకునే పోరా టంలో ముందుంటామన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకొని  ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలో ఆనాటి ఉద్యమకారులు మరో పోరాటం చేయాలని పిలుపుని చ్చారు. పాలన సౌలభ్యం పేరుతో అక్కరకు మించి కొత్త జిల్లాలను చేసి ఆయా ప్రాంతాల అస్థిత్వాన్ని నాశనం చేయడంతో పాటు పార్టీ పేరును బిఆర్‌ఎస్‌గా మార్చి తెలంగాణ అస్థిత్వాన్ని లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలు క్రమేణా మూసివేస్తున్నరని, ఉన్నత విద్యాలయాలను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌ ‌విశ్వవిద్యాలయాలను నెలకొల్పడాన్ని ఎదురించాలని అన్నారు. పోరాట ఖిల్లాగా పేరున్న ఓరుగల్లు నుండే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని ఉదృతం చేయాలన్నారు. సీనియర్‌ ‌జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పక్షులు వాలినట్లు ఇంతకాలం దుర్మార్గ పాలనలో కొనసాగిన నాయకులు నేడు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, పాలన మారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా మళ్లీ దోపిడి పాలన కొనసాగే ప్రమాద ముందన్నారు. దొంగల రాజ్యం కొనసాగుతున్నపుడు పౌర సమాజం నిఘా పెంచిన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుం దన్నారు. ధన చౌర్యం జరగకుండా పౌర సమాజం జాగ్రత్తగా ఉండాలి.

దోపిడి పట్ల ప్రశ్నించే అవకాశం ఉండే పాలనను తెలంగాణ ప్రజలు కోరుకుంటు న్నారన్నారు. దేశంలో మోదీ పాలన, తెలంగాణలో కెసిఆర్‌ ‌పాలనలో కనీసం ప్రశ్నించే స్థితి లేదని ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు, తెగువకు నెలవైన తెలంగాణ మరో పోరాటం చేయాలన్నారు. మేలుకో తెలంగాణ ఏలుకో తెలంగాణ నినాదంతో తెలంగాణ పౌర సమాజం కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయవాది నిరూప్‌ ‌రెడ్డి, కరుణాకర్‌ ‌రెడ్డి, టీపీ జేఎసి కో-కన్వీనర్‌లు కన్నెగంటి రవి, అంబటి నాగయ్య, టిపి జాక్‌ ‌కో-కన్వీనర్‌ ‌మైస శ్రీనివాస్‌, ‌విసికె పార్టీ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్‌ ‌జిలుకర శ్రీనివాస్‌, ‌టిపి జాక్‌ ‌నాయకులు బి.రమాదేవి, ప్రజా సంఘాల నాయకులు నల్లెల రాజయ్య, సోమ రామమూర్తి, చింతకింది కుమారస్వామి, చాపర్తి కుమార్‌ ‌గాడ్గే, దిడ్డి ధనలక్ష్మి, శాగంటి మంజుల, కేడల ప్రసాద్‌ ‌తదతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page