సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 10: ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలలో ఈసీఐ గైడ్లైన్స్ పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు.జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో ఇ – రోల్, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, పోస్టల్ బ్యాలెట్, ఫామ్ 12 D, సి విజిల్, మార్క్డ్ కాపీ తయారీ, సువిధ పర్మిషన్స్ తదితర అంశాలపై సమీక్షించి, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఆయా అధికారులు తప్పనిసరిగా భారత ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలన్నారు. సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎం సి సి)ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను అందజేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ ప్రారంభించాలని, ఓటరు జాబితా మార్క్డ్ కాపీ తయారీ పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నామినేషన్ల స్క్రు టినీకి అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుని చేయాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వరాదని సూచించారు.సువిధలో అనుమతులనునిర్ణీత సమయంలోగా ఇవ్వాలన్నారు.ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి తదితర బృందాలు అప్రమత్తంగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ నగేష్, సంబంధిత నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.