అందువల్లే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి..9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే
పారిశ్రామికవేత్తల సమస్యలన్ని తీరుస్తాం
మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బంధుకు పరిమితి విధింపుపై పరిశీలన
విద్యుత్ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి
పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8 : స్టేబుల్ గవర్నమెంట్..ఏబుల్ లీడర్షిప్ వల్లే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే..పారిశ్రామికవేత్తల సమస్యలన్ని తీరుస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వోట్ల కోసం అబద్దం చెప్పట్లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సోమాజిగూడలోని హోటల్లో పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా పారిశ్రామిక వేత్తలు తమ సమస్యలను తెలిపారు. కొత్త పరిశ్రమలకు ఇచ్చినట్టే పాత కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మాతో పాటు, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి సాధ్యమైందన్నారు. కర్ణాటక నుంచి వొచ్చిన ఓ నాయకుడికు స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వకపోవడంతో.. .తెలంగాణలో 5 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నట్లు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని..మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వొస్తే 24 గంటలు నీళ్లు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
మళ్లీ ప్రభుత్వం రాగానే పారిశ్రామిక వేత్తల సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఇండస్ట్రీ పెట్టాలనుకునే వారికి 15 రోజుల్లోనే స్వీయ ధృవీకరణ పత్రాలు ఇస్తున్నామని.. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామిక వేత్తలు తెలంగాణకు వొస్తున్నారని అన్నారు. దిల్లీ, గుజరాత్ నుంచి నాయకులు వొచ్చి రాష్ట్రంలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని నాయకులు ఆరోపిస్తున్నారని..అబద్దం వంద సార్లు చెప్తే నిజం అయిపోదని ధ్వజమెత్తారు. రైతుబంధు వల్ల ఎక్కువ భూమి ఉన్న వాళ్లకే లాభం జరుగుతుందని..అందుకే మళ్లీ ప్రభుత్వంలోకి రాగానే రైతుబంధుకు పరిమితి విధించే అంశంలో పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మల్లాపూర్, గాంధీనగర్, జీడిమెట్ల, నాచారం, చర్లపల్లి పారిశ్రామి కవాడల ఛైర్మన్లు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరవాత 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో అనుమానాలు ఉండేవి.. పరిపాలన సాధ్యమవుతుందా అనేవారు. ఎన్నో అనుమానాల మధ్య పరిపాలన ప్రారంభమయింది.. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు రోజులకోకసారి కూడా కరెంట్ లేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం 24 గంటలు ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.