జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి,ప్రజాతంత్ర, నవంబర్ 5: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఆర్ అండ్ బి, ఎన్నికల విభాగపు సిబ్బంది, తదితర అధికారులతో ఆదివారం రుద్రారం వద్దగల గీతం యూనివర్సిటీ లోని సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లు, పాటించాల్సిన నియమ నిబంధనల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు నకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా ఏర్పాట్లు చేపట్టాలని, అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈసీఐ సూచనల మేరకు కౌంటింగ్ హాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా చేయాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడానికి గల నిబంధనలు, కౌంటింగ్ ఏజెంట్ల నియామక నిబంధనలను, అబ్జర్వర్ లకు సంబంధించి చేసుకోవాల్సిన ఏర్పాట్లు, రాండ మైజేషన్ ,పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎలా చేయాలి, ఆర్ ఓల బాధ్యతలు,తదితర విషయాలపై కలెక్టర్ వివరించారు. ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూముల వద్ద ఎలా ఉండాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు, వీడియోగ్రఫీ చేయడం, రాండ మైజేషన్ ఎప్పుడెప్పుడు చేయాలన్న వాటిపై రిటర్నింగ్ అధికారులకు వివరించారు.
కౌంటింగ్ హాల్ కు ఎంట్రీ, ఎగ్జిట్ ఉండాలని రెండు వైపులా గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో కావలసిన వసతులు, ఆయా ఏర్పాట్లు ప్రణాళిక తో చేయాలన్నారు. ఆయా ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు ముందస్తుగా పరిశీలించుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు నకు సంబంధించి సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్నింటిపై పూర్తి అవగాహనతో చేయాలన్నారు. ఈ నెల 20 లోగా వంద శాతం ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. పి ఓ , ఏ పి ఓ లశిక్షణలు పూర్తి చేయాలని, సువిధలో అనుమతులను వెంట వెంటనే ఇవ్వాలని, ఎ లాంటి జాప్యం చేయరాదని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి డిఆర్ఓ నగేష్, డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్ ఆందోల్, పటాన్చెరు, నారాయణఖేడ్ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి అవినాష్ నాయక్, ఆర్ అండ్ బి ఈ ఈ, డి ఈ, ఎన్నికల విభాగపు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.