పరకాల,ప్రజాతంత్ర,నవంబర్3: పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి తొలి రోజు పాద యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు, ప్రజలు వెన్నంటి రాగా కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కటాక్షపూర్ నుంచి ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. హౌస్ బుజుర్గ్ లో పర్యటించి ప్రజలనుద్దేశించి రేవూరి మాట్లాడారు. కార్య కర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చారు. మాయ మాటలతో మోసం చేసే నైజం కాదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం తన దన్నారు.
పరకాల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత వహిస్తానని చెప్పారు. మాయమాటల కెసిఆర్ పాలనలో బంగారు తెలంగాణ బూడిద తెలంగాణగా మారిందని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు నెరవేర్చలేదని అన్నారు. అధికార అవినీతి భూతాన్ని తరిమి కొట్టా లంటే అందరం సమిష్టిగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్రజల పక్షం వహించాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్క హామీ నెరవేర్చని కెసిఆర్ పాలన అవసరమా అంటూ ప్రశ్నించారు. నిజమైన ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని, మాయల మరాఠీ కేసీఆర్ ను ఇంటికి సాగనంపడమే ధ్యేయంగా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.