తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు. ముస్లింలకు విద్య, ఉద్యోగ అన్ని రంగాల్లో 12 శాతం రిజర్వేషన్ కొరకు త్వరలో దేశవ్యాప్త చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే 50 సం.లు దాటిన వారికి, వృద్ధాప్య, వికలాంగుల, వితంతువుల పెన్షన్ రూ.7500 ఇస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షలు రుణ మాఫీ ఇస్తామన్నారు. రైతు భరోసా తీసివేసి వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచిత కరెంటు, పరిశ్రమల స్థాపనకు విదేశీ పెట్టుబడులు తెప్పించి వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. గ్యాస్ రూ.350 కి తగ్గించి సం.నికి 12 సిలిండర్ ఇస్తామన్నారు. విదేశీ విద్య ఖర్చు భరించి, ప్రతీ విద్యార్థికి నెలకి రూ.10 వేలు ఇస్తామన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారు. అకాల మరణం చెందిన వారి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్స్, ఉచిత బస్సు ప్రయాణం, సమానత్వం హక్కు కల్పిస్తామని పేర్కొన్నారు. నదులను అనుసంధానం చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గోవా తరహాలో మద్యం రేట్లు తగ్గించి ఇస్తామన్నారు. రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులకు, న్యాయవాదులకు, డాక్టర్లకు, ఇంజినీర్లకు నెలకు రూ.50 వేలు అందజేస్తామన్నారు. వాహన డ్రైవర్లను ఓనర్లుగా చేస్తామన్నారు. జిల్లాకొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడి అడవులను రక్షిస్తామన్నారు. దేవస్థానాలకు ఉన్న రుసుమును తీసివేసి ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు, దేవాలయాల భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు 2 ఎకరాలు ఉచితంగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెసిడెంట్ మొహమ్మద్ బాబర్, సయ్యద్ సైదా, షేక్ బాషా పాల్గొన్నారు. తెలంగాణ పోటీ చేయు అభ్యర్థులు బీఫామ్ కొరకు ఫోన్ : 9160671787, 9063960145 నెం.లలో సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page