దుర్గాష్టమి సందర్భంగా
సృష్టియందు గల చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీత మైన, అనిర్వచనీయ మైన, అవ్యక్త మైన, చైతన్య వంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందుగల జ్యోతిర్మండల, గాలి, నిప్పు , నీరు, భూమి ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది అందరూ ఆమోదించే విషయం. ఆశక్తినే మహేశ్వరిశక్తి గాను, పరాశక్తి గాను, జగన్మాత శక్తి గాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈశక్తి లేకుంటే శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే ‘‘దుర్గ’’ యని ఆది శంకరాచార్యులు అమృత వాక్కులో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశన మౌతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం తెలియ చేస్తున్నది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపు కుంటారు. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏనోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.
‘‘సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే’’…
మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి – అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు. రక్తబీజగా పూజిస్తారు. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తే ఈతి బాధలు తొలగి పోతాయని విశ్వాసం. నవరాత్రుల్లోని తొలి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తర్వాత మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని ఆధ్యాత్మిక నిపుణులు చెపుతారు. మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవి పూజించలేని భక్తులు దుర్గాష్టమి, విజయ దశమి నాడు పూజ చేస్తే అష్టైశ్వర్యాలతో కూడిన సుఖ జీవితం లభిస్తుంది. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించి నందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. దుర్గాష్టమి రోజును ఆయుధాలకు, వాహానాలకు పూజ చేస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు.
ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గా దేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహా స్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవ బంధాలో చిక్కుకున్న మానవుడిని మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శతృబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగి పోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహ కారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. ‘’ ఓం దుం దుర్గాయైనమ:’’ అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి. ఈ దినం ‘’ఆయుధ పూజ లేక అస్త్రపూజ ‘’ చేయడం సాంప్రదాయం.
ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. తమ పిల్లలకు తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయ దశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో చిన్నారుల చేత ‘’ఓంకారం’’ రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు. వ్యాపారులు తమ షాపులు, వ్యాపార సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. వాహనాలను శుభ్ర పరచుకుని పసుపు, కుంకుమ పూలతో అలంకరించుకుని పూజిస్తారు. నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడి కాయలతో దిష్టి తీసి కొడతారు. కొత్తగా వ్యాపారం దుర్గాష్టమి, విజయ దశమి రోజుల్లో ఆరంభించడం శుభ సూచకంగా భావిస్తారు. సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలి. శక్తి కొలది గోమాతకు ఏదైనా గ్రాసం తినిపించి మూడు ప్రదక్షిణలు చేస్తే మంచిది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494