కెటిఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా అధికార పార్టీ బిఆర్‌ఎస్‌లోకి బిజెపి, కాంగ్రెస్‌ల నుంచి ఆయా పార్టీల నాయకులు చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్లు ఆశించిన వారికి అక్కడ ఆశించిన స్థాయిలో ఫలితం ఉండకపోవటంతో బిఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎక్కువగా మంత్రులు కెటిఆర్‌, హరీశ్‌రావుల సమక్షంలో ఈ చేరికలు ఉండటం గమనార్హం. అయితే ఈసారి మళ్లీ బిఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలోకి వొస్తుందని ఇప్పుడు పార్టీలోకి వొచ్చిన వారికి వెంటనే ప్రాధాన్యత లేకపోయిన తరువాత మంచి పదవులు ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బాలకృష్ణారెడ్డి, రాజేందర్‌ గులాబీ గూటికి చేరారు. వీరిద్దరికి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక వనపర్తి జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో రావుల చంద్రశేఖర్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. వనపర్తి జిల్లాలో రావుల చంద్రశేఖర్‌ రెడ్డికి మంచి పట్టుంది. ఇక మంత్రి హరీష్‌ రావు ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసితోపాటు బిజెపి, కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ…రానున్న ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌ పార్టీయేనని స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలకు అపారమైన ప్రేమ ఉందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్‌ కొట్టేది ‘కారే’ అని చెప్పారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంగారెడ్డి జిల్లా అందోల్‌ నియోజకవర్గం అల్లాదుర్గ్‌ మండల మాజీ జెడ్పీటీసీ మమతా బ్రహ్మంతోపాటు పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు మంత్రి హరీష్‌ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వివిధ సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న బ్రహ్మం ప్రస్తుతం బీజేపీలో వున్నారు. ఆయనతోపాటు మెదక్‌ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సాయిలు, యువజన నాయకులు పవన్‌, వార్డు మెంబర్‌ నర్సింహ, యువజన సంఘాల మండల అధ్యక్షులు మహేష్‌ గౌడ్‌, బీజేపీ యూత్‌ అధ్యక్షుడు ఆంజనేయులు, రేగోడ్‌ మండల బీసీ సంఘ అధ్యక్షులు శేఖర్‌ బీజేపీ మోర్చ నాయకులు శేఖర్‌తోపాటు 100 మంది కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page