దొరల తెలంగాణ..ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలు

దేశమే నా ఇల్లు..ప్రజల గుండెల్లోనే నాకు చోటు
బీఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎం మూడు ఒకే కూటమి
రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చాక కులగణన
రాష్ట్రం మొత్తం ఒకే కుటుంబం చేతుల్లోకి..
దొరల కోసం కాదు..ప్రజల కోసం తెలంగాణ ఇచ్చాం
జగిత్యాల విజయభేరి సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ

జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : రాబోయే అసెంబ్లీ ఎన్నికలు దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఏఐసీసీ కార్యదర్శి రాహుల్‌ గాంధీ అన్నారు. రాష్ట్రంలో తన మూడోరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్‌ చౌరస్తాలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ…ప్రజా తెలంగాణ కోరుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో నియత్రంత్వ దొరల పాలన సాగుతుందని, ప్రజాస్వామ్య తెలంగాణ వొస్తుందని భావిస్తే.. దొరల తెలంగాణ వొచ్చిందని అన్నారు. భూ కబ్జాలు..మద్యం మాఫియా..ఒక కుటుంబం జేబుల్లోకి పోతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి వర్గాల కోసం..దొరల కోసం ఇవ్వలేదని, సామాజిక తెలంగాణ కోసం ఇచ్చామని, దాని నిర్మాణం కోసం కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ చక్కెర కర్మాగారం మూసివేసిందని, కాంగ్రెస్‌ అధికారం లోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలు పునః ప్రారంభిస్తామన్నారు. పసుపుపై ప్రతి క్వింటాల్‌పై 12000 నుండి 15000 మద్దతు ధర చెల్లిస్తామని, వరి ధాన్యంపై ప్రతి క్వింటాల్‌ పై మద్దతు ధర పై అదనంగా రు.500 ఇస్తామన్నారు. తమకు తెలంగాణ ప్రజలతో దశాబ్దాల తరబడి అనుభందం ఉందని, జవహర్లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ నుండి అది కొనసాగుతున్నదని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఓకే కూటమని, చీకటి ఒప్పందంతో కలిసి పని చేస్తాయని, మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులన్నిటికీ బీఅర్‌ఎస్‌ సపోర్ట్‌ చేస్తుందని అన్నారు. మతతత్వ రాజకీయ పార్టీతో పోరాటం చేస్తున్నందుకు తనకు ఇల్లు లేకుండా గెంటివేశారని, పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేశారని, అయితే తనకు ఇళ్లు అవరసం లేదని, దేశమే తన ఇల్లని…తెలంగాణలోని ప్రతి నిరుపేద ఇల్లు తనదేనని, ప్రజల గుండెల్లోనే తనకునెల్లప్పు చోటు ఉందని రాహుల్‌ ఉద్వేగానికి లోనయ్యారు. రాజస్థాన్‌, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రంలో ఎక్కడైనా కాంగ్రెస్‌ పార్టీని ఓడిరచడానికి ఎంఐఎం పార్టీ బిజెపి కి సపోర్ట్‌గా పోటీ చేసిందని అన్నారు. కాంగ్రెస్‌ విజయాన్ని అడుకోవడమే బిజెపి. ఏంఐఎం లక్ష్యమని అన్నారు. సీఎం కెసిఆర్‌ బలహీన వర్గాలకు కల్పించే రిజర్వేషన్‌ పట్ల కూడా చొరవ చూపడం లేదని, బలహీన వర్గాల జనాబా వెలికి రావటం మోదీకి, కెసిఆర్‌కు ఇష్టం లేదని రాహుల్‌ ఆరోపించారు. భారత దేశాన్ని అగ్రవర్ణాలకు చెందిన 90 శాతం ఐఎఎస్‌లు పాలిస్తున్నారని అన్నారు. ఎందుకు కుల గణన చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఐఎఎస్‌ అధికారుల్లో బలహీన వర్గాల ప్రజలు ఎంత మంది ఉన్నారనేది ప్రజల ఆలోచించాలని, వాస్తవాన్ని గ్రహించాలని అన్నారు. వారికి కేవలం 5 శాతం బడ్జెట్‌ మాత్రమే కేటాయిస్తున్నారని, దేశంలో ఐదు శాతమే ఓ బీసీలు వున్నారా..అని ప్రశ్నించారు. 50 శాతం బలహీన వర్గాల ప్రజలు ఉన్నారని, సామాన్యుల హక్కులు, డబ్బులు అదాని బ్యాంక్‌లోకి పోతున్నాయని రాహుల్‌ దుయ్యబట్టారు. కుల గణన చేయడానికి మోదీ అడ్డుకుంటున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బలహీన వర్గాల గణన చేపడుతామని, తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల కుల గణన చేపట్టి జనాబా మేరకు హక్కులు కల్పిస్తామన్నారు. కుల గణనతో ఎక్కడ మోసం బయటపడుతుందోనని భయపడుతున్నారని, తెలంగాణ ప్రజల స్వప్నం నిజం చేసేందుకు, ముందుగా కుల గణన చేపడతామన్నారు. బిఆర్‌ఎస్‌ పాలనకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడాలని, ఉద్యమ పోరాట యోధులను భాగస్వాములను చేసి ప్రజల తెలంగాణ తెలంగాణ ఏర్పాటు చేస్తామన్నారు. నాడు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీలు, నేడు సోనియా గాంధీ..రాహుల్‌ గాంధీలు దేశం కోసం సైనికుల్లా కాపలాగా ఉన్నామని, ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద ఏర్పడినా తాను వారి ముందు నిలబడుతానన్నారు. జీవన్‌ రెడ్డిని శాసన సభకు పంపాలని రాహుల్‌ ప్రజలను కోరారు. జీవన్‌ రెడ్డి ఆత్మ ప్రజలతో ముడిపడి ఉందని, అట్లాగే అడ్లురీ లక్ష్మణ్‌ కుమార్‌ను కూడా గెలిపించాలని రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి చేశారు. సభకు వొచ్చిన ప్రజలందరికి రాహుల్‌ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ…రాహుల్‌ గాంధీ ప్రచారం కాంగ్రెస్‌ విజయానికి ప్రతీక అని, నాలుగు దశాబ్దాల నుండి గెలిచినా ఓడినా తాను ప్రజల మధ్యే ఉన్నానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు జగిత్యాల నాంది పలుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఇంచార్జి మాణిక్‌ రావు థాక్రే, కేసి వేణుగోపాల్‌, ఉత్తమకుమార్‌, బట్టి విక్రమార్క, దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సీతక్క పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page