కడుపులో పెట్టుకుని రెండుసార్లు గెలిపించారు
చేయాల్సింది ఇంకా ఉంది…లీడర్లు ఇదే చాలని ఊరుకోవద్దు…కావాలని పట్టుపట్టాలి
బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం…95 నుండి 105 స్థానాలు గెలుస్తాం
గజ్వేల్ నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో సిఎం కేసీఆర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : గజ్వేల్ నియోజకవర్గంలోని బిడ్డలు తనను కడుపులో పెట్టుకుని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనీ బిఆర్ఎస్ పార్టీ అధినేత, సిఎం, గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వొచ్చే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని శుక్రవారం సికింద్రాబాద్`సిద్ధిపేట రాజీవ్ రహదారిపైన గల అంతాయపల్లి ఎస్ఎన్ఆర్ పుష్ప ఫంక్షన్ హాలులో జరిగిన గజ్వేల్ నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల విస్తృత సమావేశంలో సిఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ…తాను కామారెడ్డిలో పోటీ చేయడానికి ఓ కారణం ఉందని, నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో తాను చేపిస్తానని. వొచ్చే టర్మ్‌లో తాను నెలకు ఒక్కపూట గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంటానని….వారితోనే గడుపుతానని కెసిఆర్ అన్నారు. గజ్వేల్‌లో కొంత చేశామని, చేయాల్సింది ఇంకా ఉదనీ, ఇదే చాలనీ లీడర్లు ఊరుకోవద్దని, ఇంకా కావాలని పట్టుపట్టాలన్నారు. గజ్వేల్‌కు ఇంకా చేయాలన్నారు. పదవులు వొస్తాయి, పోతాయని, ఉన్నప్పుడు ఏం చేశారనేది ముఖ్యమని అన్నారు. తాను ఒక్కసారే ఒడిపోయానని, అప్పుడు కూడా ఓడిపోలేదని, ఓడిరచపడ్డానని…అప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్లు లేకుండెనని, బ్యాలెట్ పేపర్ ఉండడంతో 6 వోట్లతో ఓడిరచారన్నారు. ఊర్లలోకి మిషన్ భగీరథ నీళ్లు వొస్తున్నాయనీ, ఊర్లో మోటర్ లేదు కానీ నీళ్లు వొస్తున్నాయనీ, ఊర్లో మోటర్ లేదు…సంపూ లేదు కానీ, నీళ్లు మాత్రం వొస్తున్నాయన్నారు. దానికి ప్రేరణ సిద్ధిపేట ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పుడు సిద్ధిపేటలో భయంకరమైన కరువు ఉండేదనీ, అప్పుడు ఆలోచన చేసి మిడ్‌మానేరు నుండి ఎత్తైన గుట్టపైకి నీళ్లు సరఫరా చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చామనీ, అదే తరహాలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నామన్నారు.