బిసి జనగణనపై బిఆర్ఎస్ స్పందించకపోతే కార్యచరణ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించిన ఏ అంశాన్ని చేర్చకపోవడం చాలా బాధాకరం అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు చట్టసభలు, రిజర్వేషన్లు, బీసీల సమగ్ర కుటుంబ సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు అనే విషయాలను చేర్చకపోవడం చాలా అన్యాయమని అన్నారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిందని, ఈ మేనిఫెస్టోలో కేవలం ఓటర్లను ఆకర్షించి రాయితీలు సబ్సిడీల వరకే మేనిఫెస్టో పరిమితం చేసి, మెజార్టీ ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలను విధానాలను మేనిఫెస్టోలో లేకపోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టి బీసీలకు తామే ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, తాను ప్రకటించిన 55 స్థానాలలో బీసీలకు కేవలం 12 స్థానాలు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అలాగే ఈ 12 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కనీస బలం లేని ఓడిపోయే స్థానాలైన పాతబస్తీలో నాలుగు సీట్లను కేటాయించి, బీసీలను అవమానించిందన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ పార్టీ ఒక వైపు రాహుల్ గాంధీ బీసీ కులగనన నిర్వహిస్తామని, బీసీ మహిళ బిల్లులు, బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, బీసీలకు సానుకూలంగా మాట్లాడుతుంటే, ఇంకొక వైపు ఇక్కడి కాంగ్రెస్ రెడ్డి నేతలు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించి, గెలుపు గుర్రాల పేరుతో రెడ్డి, వెలమలకే, బిఆర్ఎస్ పార్టీ లాగానే ఎక్కువ స్థానాలు కేటాయించి సామాజిక న్యాయాన్ని తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూదాని సదానందం, రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్,బిసి యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, గూడూరు భాస్కర్ మేరు, బూడిద మల్లికార్జున యాదవ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page