జనసంద్రమైన హుస్నాబాద్..సిఎం సభకు పోటెత్తిన జనం

 సక్సెస్ తో గులాబీ పార్టీలో కొత్త జోష్..

హుస్నాబాద్, ప్రజాతంత్ర , అక్టోబర్ 15: హుస్నాబాద్ గులాబీ మయమైంది. హుస్నాబాద్ పట్టణంలోని సబ్ స్టేషన్ పక్కన సి ఎం కేసీఆర్ హాజరైన ప్రజాశీర్వాద సభకు జనం పోటెత్తారు. సుమారు లక్షమంది జనం ఈ సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సభ సూపర్ సక్సెస్ అయింది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీ ఆర్ ఎస్ అభ్యర్థుల సమావేశం నిర్వహించి మేనిఫెస్టో ప్రకటించి అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన కేసీఆర్ నేరుగా హుస్నాబాద్ ఆశీర్వాద సభకు హెలికాఫ్టర్ లో హాజరయ్యారు. సి ఎం వెంట మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, వొడితల సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు సభకు హాజరయ్యారు. సి ఎం రాకకు ముందే మైదానం జనంతో నిండిపోయింది. వరంగల్, కరీంనగర్, జనగాం, సిద్ధిపేట మార్గాల్లో పెద్ద ఎత్తున జనంతో వచ్చే వాహనాలతో నిండిపోయింది. బతుకమ్మలు, కోలాటాలు, పీరీలు డప్పుచప్పుళ్ళతో జనం ఉత్సాహంగా హాజరయ్యారు. గాయకుడు ఏపూరి సోమన్న తన పాటలతో ఉర్రూతలూగించారు.
నలుమూలల నుండి చీమలదండులా..
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సి ఎం కేసీఆర్ సభకు నియోజకవర్గం నలుమూలల నుండి చీమల దండులా ప్రజలు హాజరయ్యారు. అన్ని మార్గాల నుండి వందల సంఖ్యలో వాహనాలు బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, ట్రాలీల్లో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. పట్టణంతో పాటు అన్ని మార్గాల్లో జనంనిండిపోయారు. సభ స్థలికి వేలాది మంది ఇంకా చేరుకోలేక పోయారు. సభకు గ్రాండ్ సక్సెస్ అయ్యేందుకు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మైక్రో ప్లానింగ్ చేసారు. మండల, గ్రామా స్థాయిల్లో ప్రణాళిక చేసారు. ఏ గ్రామం నుండి ఎంత మంది రావాలో ఎలా రావాలో ప్రణాళిక చేసారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కార్యకర్తల తో సమావేశం నిర్వహించడంతో పాటు టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు.
హుస్నాబాద్ లో బలం బలగం ప్రదర్శించిన గులాబీ పార్టీ
హుస్నాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి మొదటి నుండి పట్టుంది. 2018 ఎన్నికల్లోనూ తొలి ఎన్నికల ప్రచార సభ హుస్నాబాద్ లోనే జరిగింది. ఈ సారి కూడా హుస్నాబాద్ లోనే సభ జరగడంతో అందరి దృష్టి హుస్నాబాద్ పై పడింది. ఐతే ఊహించిన దానికంటే ఎక్కువగా సభ సక్సెస్ అయింది. ఈ సభ ప్రతిపక్ష పార్టీలో దడ పుట్టించడంతో పాటు వారిలో గుబులు రేపింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నాయకత్వంలో పటిష్టంగా ఉండడంతో పాటు మరోసారి విజయబాటలో ఉందనే సంకేతాలు ఇచ్చింది. పార్టీ శ్రేణులోనూ ఈ సభ జోష్ నింపడంతో పాటు హుస్నాబాద్ లో గులాబీ తిరుగులేని శక్తిగా ఉండనే సంకేతాన్ని జనంలో బలంగా పంపింది. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ వ్యూహాన్ని, రాజకీయ చతురతను, అయన నాయకత్వం మీద ఉన్న విశ్వాసాన్ని ఈ సభ నిరూపించింది. “అతడే ఓ సైన్యం” అన్న తీరుగా సతీష్ కుమార్ పని చేస్తున్న తీరు ప్రతిపక్షాలను సైతం నివ్వెర పరుస్తోంది.
ఆకట్టుకున్న ప్రసంగాలు
హుస్నాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో అందరి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. సి ఎం కేసీఆర్ తన ప్రసంగంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మరోసారి మోసం చేస్తారని విమర్శించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మంచి నాయకుడని, అలంటి నాయకునికి మద్దతు ఇవ్వాలని సి ఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ గతంలో ఎడారి లా ఉండేదని, కానీ ప్రస్తుతం చాలా మార్పు వచ్చిందని, తాను హెలికాఫ్టర్ లో వస్తుంటే.. పచ్చని పొలాలు, చెక్ డ్యాములు కనిపిస్తున్నాయని, గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామని అన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బీ ఆర్ ఎస్ మేనిఫెస్టోలో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మచ్చ లేని నాయకుడని, రాబోయే ఎన్నికల్లో భారీ విజయం కట్టబెట్టాలని, సతీష్ కుమార్ అభివృద్ధి కోసం తపనపడే నాయకుడని అన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలు, ఎన్నికల హామీలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.
సి ఎం చేతుల మీదుగా బీ ఫారం వేదికపై అందుకున్న ఎమ్మెల్యే సతీష్
తెలంగాణ భవన్ లో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థులకు 51 మందికి సి ఎం కేసీఆర్ బీ ఫారాలు అందజేసిన విషయం తెలిసిందే. కాగా హుస్నాబాద్ లో వేదికపై సి ఎం కేసీఆర్ తన ప్రసంగం ముగిసిన తర్వాత సతీష్ కుమార్ కు తన చేతుల మీదుగా బీ ఫారం అందజేశారు. సి ఎం సతీష్ కుమార్ కు “ఆల్ ది బెస్ట్” అంటూ సి ఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనతంరం సతీష్ కుమార్ సి ఎం కు కృతజ్ఞతలు తెలిపారు.
సభ సక్సెస్ తో గులాబీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు
హుస్నాబాద్ లో ఆదివారం నిర్వహించిన సి ఎం కేసీఆర్ ఆశీర్వాద సభ సక్సెస్ తో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే యువనేత ఇంద్రనీల్ యువతలో జోష్ నింపి సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హుస్నాబాద్ కు వచ్చిన సి ఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, నాయకులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. యువత కేరింతలతో సభ దద్దరిల్లింది. సభ ముగిసిన తర్వాత మంత్రి హరీష్ రావు సిద్ధిపేట వెళ్లగా, సి ఎం కేసీఆర్ హెలికాఫ్టర్ లో హైదరాబాద్ వెళ్లారు. సి ఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ వీడ్కోలు పలికారు. సభ అనుకున్న దానికంటే ఎక్కువ జనం వచ్చి భారీగా సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page