కాంగ్రెస్‌ గ్యారెంటీలను కాపీ కొట్టిన కేసీఆర్‌

బీఆరెస్‌ తన ఉనికిని కోల్పోయింది
కేసీఆర్‌ ఆలోచన శక్తి కోల్పోయారు
కేసీఆర్‌ కు సూటిగా సవాల్‌ విసురుతున్నా..
ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా వోట్లు అడగాలి.
17 న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం రా..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కేసీఆర్‌ కాపీ కొట్టి బీఆరెస్‌ మేనిఫెస్టో ప్రకటించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మా గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్‌ పెద్ద అగాథంలో పడిపోయారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. మేం ఆరు గ్యారంటీలు ఇస్తామంటే బీఆరెస్‌ నేతలు అదెలా సాధ్యమన్నారు కానీ ఇప్పుడు బీఆరెస్‌ నేతలు కాంగ్రెస్‌ ను ప్రశ్నించే అర్హత కోల్పోయారని ఎద్దేవా చేశారు. బీఆరెస్‌ తన ఉనికిని కోల్పోయింది…. కేసీఆర్‌ ఆలోచన శక్తి కోల్పోయారని సెటైర్‌ వేశారు. బీఆరెస్‌ కు ఆలోచన, ఆచరణ, సంక్షేమం అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ ఒక చిత్తు కాగితంగా చూస్తోందని దానిపై చర్చ అనవసరమన్నారు రేవంత్‌ రెడ్డి.‘‘మహాలక్ష్మి పథకం కింద మేం రూ.2,500 అంటే కేసీఆర్‌ ఇవాళ రూ.3 వేలు అన్నారు… ఆడబిడ్డలకు మేం రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ అంటే ఆయన రూ.400 అన్నాడు… పెన్షన్ల విషయంలో మేం రూ.4 వేలు అంటే ఆయన రూ.5 వేలు అన్నాడు… మేం ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ.15 వేలు ఇస్తామంటే… ఆయన ఇప్పుడు రూ.16 వేలు ఇస్తామంటున్నాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గతంలో సారా పాటలు నిర్వహించేవారు. అయితే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనకుండానే కేసీఆర్‌ మమ్మల్ని కాపీ కొట్టి పెద్ద లోయలో పడిపోయారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే… రాష్ట్రం దివాళా తీయడమే కాదు, కేసీఆర్‌ బుర్ర కూడా దివాళా తీసింది. కేసీఆర్‌ లో ఆలోచించే శక్తి సన్నగిల్లింది’’ అన్నారు రేవంత్‌ రెడ్డి. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాను కలర్‌ లో చూపించినట్లు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉందని.. పాత హామీలనే అమలు చేయకుండా.. ఇప్పుడు మరో సారి మోసం చేద్దామని ముందుకొచ్చినట్లు ఉందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ఇక ఎంతమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. కేసీఆర్‌, ఆయన పార్టీ పరాన్నజీవులు. పక్కవాళ్ల మీద ఆధారపడి బతికేవాడు పరాన్నజీవి. ప్రజా సంక్షేమం పట్ల ఆలోచన, చిత్తశుద్ధి బీఆర్‌ఎస్‌ పార్టీలో లోపించాయనడానికి వాళ్ల మేనిఫెస్టోనే నిదర్శనమని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాగితంపై రాసుకుని ఇవాళ బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను రిలీజ్‌ చేశారు. మేం రూ.4 వేల పెన్షన్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామంటే… అదెలా సాధ్యమవుతుంది? అంటూ ఇన్నాళ్లు మాట్లాడిన బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు వారి మేనిఫెస్టో పట్ల ఏం సమాధానం చెబుతారు? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.కేసీఆర్‌ లా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదని ఆరు గ్యారంటీలను అమలు చేయగలమనే నమ్మకంతోనే వాటిని ప్రకటించామని రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలను కాపీ కొట్టడం ద్వారా వాటి అమలు సాధ్యమని కేసీఆర్‌ రాజముద్ర వేసి మరీ అంగీకరించినట్లయిందన్నారు. కాంగ్రెస్‌ హామీలు ఆచరణ సాధ్యమని కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ తో ప్రజలకు అర్ధమైందన్నారు రేవంత్‌ రెడ్డి.
కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లు పొందిన అభ్యర్థులకు రేవంత్‌ అభినందనలు తెలిపారు. మా అభ్యర్థులను ప్రకటించగానే.. కేసీఆర్‌ వారి అభ్యర్థులకు బీ-ఫామ్‌ లు పంచారన్నారు రేవంత్‌ రెడ్డి. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్‌ బీఆరెస్‌ కంటే ముందు ఉందన్నారు. మేం 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్‌ 51 మందికే బీఫామ్‌ లు ఇచ్చారని మిగతా వాళ్లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు రేవంత్‌ రెడ్డి. అర్థంపర్ధం లేని ఆరోపణలతో బిల్లా రంగాలు కాంగ్రెస్‌ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. అందుకే ఎక్కడో డబ్బులు దొరికితే మాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దోపిడీ సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని కేసీఆర్‌ వైఫల్యం చెందారని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘కేసీఆర్‌ కు సూటిగా సవాల్‌ విసురుతున్నా..ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి. 17 న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు నేను వస్తా…కేసీఆర్‌ నువ్వు అక్కడికి రా… ప్రమాణం చేద్దామని’’ రేవంత్‌ రెడ్డి సవాలు విసిరారు.
నిజంగా రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయకపోతే…ప్రతీ నెల ఉద్యోగులకు , ఆసరా పెన్షనర్లకు ప్రతీ నెలా మొదటి తారీఖు వాళ్ళ ఖాతాలో వేయాలని కేసీఆర్‌ కు మరో సవాల్‌ విసిరారు రేవంత్‌ రెడ్డి. అలా అయితేనే మీరు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తారని నమ్ముతామన్నారు.
కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను చూసి కేసీఆర్‌ కు చలి జ్వరం వచ్చిందన్నారు. అవినీతికి కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిండర్‌ అన్న రేవంత్‌.. కేసీఆర్‌ కు శాశ్వతంగా విశ్రాంతి అవసరమని చెప్పారు. ‘‘ఇవాళ ప్రెస్‌ మీట్‌ లో రాబోయే ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కేసీఆర్‌ కనిపించారు. కాడి కిందపడేసిన కేసీఆర్‌ కనిపించారు. కేసీఆర్‌.. మీ పాలనకు ఎక్స్‌ పైరీ డేట్‌ అయిపోయింది.. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి’’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. వందకు వంద శాతం కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆమలు చేస్తుందని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page