ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు

మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ఊరూ వాడా పండుగ సందడి
చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియనున్న ఉత్సవాలు

తెలంగాణ ఆడుపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆడ బిడ్డలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే పండుగ ఇది. దేశంలోనే ప్రకృతిలోని పూలను ఎంతో అందంగా పేర్చి పూలలోనే దైవాన్ని కొలిచే పండగ బతుకమ్మ. బాద్రపద మాసం చివరిరోజు మహాలయ అమావాస్యతో బతుకమ్మ పండగ ప్రారంభమవుతుంది. రోజుకు ఒక్కోపేరుతో సాగే ఈ పండగ తొమ్మిది రోజుల పాటు పెళ్లికాని యువతులు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలోని తొలిరోజు మహాలయ అమావాస్యనే తెలంగాణలోని ప్రజలు పెద్దల అమాస్య లేదా పెత్తరమావాస్యగా పిలుచుకుని కుటుంబంలోని మరణించిన పెద్దవారి పేరు మీదుగా బ్రాహ్మణులకు స్వయంపాకం పేరున బియ్యం, కురాగాయలు, పప్పులు దానం చేస్తారు. సాయంత్రం వేళ ఇంటి ఆడబిడ్డలు, మహిళలు, పిల్లలు కలిసి చెరువు గట్లు, దేవాలయాలు, గ్రామ ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ పుట్టుక, ప్రాశస్త్యం కాకతీయులు లేక చోళుల కాలం నుంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పండగ పుట్టుపూర్వోత్తరాల మీద అనేక గ్రామీణ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయని సాహిత్య పరిశోధకులు చెబుతారు. అయితే పెత్తరమాసతో మొదలయ్యే పండగ తొమ్మిది రోజులపాటు బతుకమ్మల ఆటలలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. మొదటి రోజు పండగ ఎంగిలిపూలతో బాలికలు, యువతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆట, పాటలతో పండగ మొదలవుతుంది. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బియ్యం బతుకమ్మ అంటారు. అదేవిధంగా ఆరో రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజున బతుకమ్మ ఆడరు. ఏడో రోజు వేపకాలయ బతుకమ్మ అని పిలుస్తారు. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా జరుపుకుంటారు. చివరి రోజుగా సద్దుల బతుకమ్మగా భారీ ఎత్తున పండగను ఘనంగా జరుపుకుంటారు. గౌరమ్మను మహిళను గౌరవంగా ఇచ్చిపుచ్చుకుంటారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ప్రసాదాలు ఎంతో వైవిధ్యంతో కూడి ఉంటాయి. బతుకమ్మ ఉత్సవాలు ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ జిల్లాలో మహిళలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ పండగను నిర్వహిస్తుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు 14 నుంచి మొదలు ఈనెల 24 వరకు బతుకమ్మ, దసరా సెలవులను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రతి ఇంటిలో ఆడ బిడ్డలు, పిల్లల రాకతో సందడి మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page