ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : గ్రామీణ ప్రాంతాల్లో తపాలా శాఖ లో పనిచేస్తున్న జిడిఎస్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ… దేశవ్యాప్తంగా జిడిఎస్ జె ఏ సీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు సమ్మెలో భాగంగా బుధవారం కల్వకుర్తి, ఆమనగల్లు, మాడ్గుల, వెల్డండ, కడ్తాల సబ్ ఆఫీస్ పరిధిలోని గ్రామీణ తపాలా ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ సెక్రటరీ రవీందర్, ప్రెసిడెంట్ హరినాథ్ రావు, వైస్ ప్రెసిడెంట్ జంగయ్య గౌడ్, విష్ణుమూర్తి, రమేష్ గౌడ్ మాట్లాడుతూ 2016 లో గ్రామీణ తపాలా ఉద్యోగుల పని పరిస్థితులు వేతనాల పరిశీలన కోసం నియమించబడిన కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్ అమలు పరచకుండా కేంద్ర ప్రభుత్వం కావాలని గ్రామీణ తపాలా ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ రకాల తపాలా సేవల తో పాటు ఆసరా పెన్షన్ డబ్బులు, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల కు డబ్బులు ఏ ఈ పీ ఎస్ ద్వారా మినీ ఏటీఎం లా ప్రజల అవసరాలకు గ్రామీణ ప్రాంతాలలో డబ్బు లు అందజేస్తున్న తమను కేవలం 4 మరియు 5 గంటలే పనిచేస్తున్న ఉద్యోగులు గా గుర్తిస్తూ తమకు తీరని అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. జిడిఎస్ లకు 8గంటలపని, పెన్షన్ తో సహా అన్ని రకాల ప్రయోజనాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కమిటీ రిపోర్ట్ లో సూచించిన విధంగా సీనియర్ జిడిఎస్ లకు 12, 24, 36 సంవత్సరాలకు సర్వీస్ కు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ ఆర్థికపరమైన ఉన్నతిని కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు గ్రాట్యూటి 5 లక్షల కు పెంచాలని….పెయిడ్ లీవ్స్ 180 రోజులకు దాచుకొని నగదుగా మార్చుకుని సౌకర్యం కల్పించాలని జిడిఎస్ వారి కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని కమిటీ రిపోర్ట్ చేసిన విధంగా బంచింగ్ విధానాన్ని అమలు చేయాలని, ఎస్ ఎస్డీబిఎస్ కాంట్రిబ్యూషన్ 10% వార్త మరో 10 శాతం కాంట్రీబ్యూషన్ డిపార్ట్మెంట్ జమ చేసి తాత్కాలిక పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రెగ్యులర్ జిడిఎస్ సెలవు పెట్టినప్పుడు వర్క్ లోడ్ తో సంబంధం లేకుండా సబ్స్టిట్యూట్ ను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలని కోరారు. ఇన్సెంటివ్ విధానాన్ని రద్దుచేసి ఐపిపిబి, ఆర్ పి ఎల్ ఐ, పి ఎల్ ఐ, ఎన్ఆర్ఈజీఎస్ అన్ని రకాల సేవింగ్ పథకాలను పనిభారంలోకి తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పైన పేర్కొన్న సబ్ ఆఫీస్ ల బీపీఎం లు, ఏబీపీఎమ్ లు పాల్గొన్నారు.