- తెలంగాణ స్టేట్ స్పౌస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వివేక్
- సిఎం స్పందించకుంటే మరిన్ని నిరసన కార్యక్రమాలు
- గాంధీ జయంతి రోజు ఉపాధ్యాయుల మౌన పోరాటం : అరెస్ట్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 02 : ఎన్నికల నోటిఫికేషన్ లోపే ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టి సమస్యకు పరిష్కారం చూపాలని తెలంగాణ స్టేట్ స్పౌస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వివేక్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ లోపు సమస్యకు పరిష్కారం మార్గం చూపకుంటే మరిన్ని నిరసన కార్యక్రమాలు చేయడానికి తాముసిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ మేరకు సోమవారం గాంధీ జయంతి నాడు తెలంగాణ స్టేట్ స్పౌస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వివేక్, కన్వీనర్ నరేష్ ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ స్పౌస్ బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట 13 జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు వారి పిల్లలతో మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వివేక్ మాట్లాడుతూ గడిచిన 22 నెలలుగా తమ కుటుంబాలు చిన్నాభిన్నమై నరకయాతన అనుభవిస్తున్నా మన్నారు.
ప్రభుత్వ పెద్దలకు అధికారులకు అనేక పర్యాయాలు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత జనవరిలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు మాత్రమే చేపట్టడం జరిగిందన్నారు. కానీ ఇంకా 1500 ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. ఇప్పటికిప్పుడు బదిలీలు చేపట్టినా 80 శాతం వరకు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఖాళీలు లేనివారికి ప్రస్తుతానికి డిప్యుటేషన్ ఇచ్చి భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలలో అడ్జస్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా అధికారులు స్పందించకపోవడం ఆవేదనకు గురి చేస్తుందని వాపోయారు.
ఈ దీక్షలో మహిళా ఉపాద్యాయులు త్రివేణి, అర్చన, అజార్ సుల్తానా, సౌజన్య, రాజేశ్వరి, శ్రీవిద్య మాట్లాడుతూ గత 22 నెలలుగా కుటుంబాలకు దూరమై మానసికంగా ఎంతో క్షోభకి గురి అవుతున్నామని అన్నారు. రోజు వందల కిలోమీటర్లు ప్రయాణించలేక శారీరక సమస్యలతో బాధ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ చిత్రపటంతో పాటు కెసిఆర్ ని కలిపి రూపొందించిన ప్లకార్డులు చేతబూని నిరసనలు చేశారు. సిఎం కెసిఆర్ పెద్ద మనసుతో అలోచించి వెంటనే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కన్నీటి పర్యంతం అయ్యారు.