డబుల్ బెడ్ రూమ్‌ల సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని,పేదలు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని,మహిళలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 378 డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించి,లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో ఆంగ్ల మాధ్యమం లో బోధన అందిస్తున్నామని,ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంగ్లంలో మాట్లాడుతుంటే నా గుండె గర్వంతో ఉప్పొంగుతుందన్నారు.
సమైక్య రాష్ట్రంలో చెరువులు ఎడారులను తలపించేవి. ఇప్పుడు ఏ చెరువు చూసినా నిండు కుండ నే అని అన్నారు.నర్మాల డ్యాం ను నింపాలని ఈ ప్రాంత ప్రజలు గంభీ రావుపేట నుండి హైదరాబాద్ లోని సిఎం ను కలిసేందుకు వెళ్లిన రోజులు గుర్తుకు తెచ్చుకున్నారని, ప్రతిగా అప్పటి పాలకులు మొక్కుబడిగా శిలాఫలకం వేసి చేతులు దులుపుకునే వారని,ఇప్పుడు నర్మాల డ్యాం 365 రోజులు నిండు కుండలా ఉంటుందన్నారు.కుడవెల్లి నుంచే కాకుండా ప్యాకేజి -9 ద్వారా నర్మాల డ్యాం ను నింపనున్నామని చెప్పారు.స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని గ్రామీణ నియోజకవర్గాలను అభివృద్ధి చేశారని,- రైతుల ఖాతాలో 73 వేల కోట్లు జమ చేశారన్నారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రైతు బీమా సకాలంలో ఎరువులు ,విత్తనాలను అందజేస్తున్నారని.9 ఎండ్లలో గంభిరావు పేట మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు.చెరువును అభివృద్ధి చేయడంతో పాటు కేజీ టు పీజీ క్యాంపస్ ను ఏర్పాటు చేశామన్నరు.
ఈ రోజు 13.5 కోట్లతో లింగన్న పేట – గంభిరావు పేట మధ్య హై లెవెల్ వంతెన కు శంకుస్థాపన చేస్తున్నామని వచ్చే వర్షాకాలంలోగా దీనిని పూర్తి చేస్తామన్నారు. నర్మాల వద్ద మరో రెండు హై లెవెల్ వంతెన లను నిర్మిస్తామని.గతంలో మున్సిపాలిటీ గా ఉన్న గంభిరావు పేట ను తిరిగి మున్సిపాలిటీ గా చేస్తామన్నరు. గంభిరావు పేట పాత జీపి వద్ద రూ.3 కొట్లతో అధునాతన మార్కెట్ ను నిర్మిస్తామని,రూ.3 కోట్లతో లక్ష్మి పూర్ రోడ్డును నిర్మించనున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 640 గుడిసెలు ,432 రేకుల షెడ్లు, 907 శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారికి మొత్తం 1967 మందికి ప్రథమ ప్రాధాన్యతగా గృహలక్ష్మి కిందను మంజూరు చేస్తున్నామని, బ్రతికి ఉన్నన్నాల్లు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు కు సేవ చేస్తూనే ఉంటానన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ,టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, గంభీరావుపేట మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.