తేల్చుకోలేకపోతున్న తెలంగాణ వైఎస్‌ఆర్‌ పార్టీ

దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి  బిడ్డ తన గమ్యాన్ని తేల్చుకోలేకపోతున్నది. రెండేళ్ళ క్రితం వైఎస్‌ఆర్‌టిపి పేర ప్రాంతీయ పార్టీని స్థాపించిన వైఎస్‌ షర్మిల మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఆయోమయంలో పడిరది. ఈ ఎన్నికల్లో తాను ఒంటిరిగా పోటీ చేయాలా లేక మరో పార్టీతో కలిసి నడువాలా అన్నది ఇదిమిద్దంగా తేల్చుకోలేకపోతున్నది. తెలంగాణలో ఈసారి నువ్వా నేనా అన్నట్లు అధికార బిఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బిజెపిల మధ్య హోరు నడుస్తున్నది. ఎవరికి వారు తమదే గెలుపని, వొచ్చేది తమ ప్రభుత్వమేనని ఘంటా పథంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పోటీలో మిగతాపార్టీల్లాగానే వైఎస్‌ఆర్‌టి పార్టీ ప్రచారంలో ముందున్నా, స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో మాత్రం లేదన్నది వాస్తవం. 2021 జూలై ఎనిమిదిన వైఎస్‌ షర్మిల సారధ్యంలో వైఎస్‌ఆర్‌టిపి పార్టీ ఏర్పడిరది. మరో ఆరు నెలల తర్వాత అనగా 2022 ఫిబ్రవరి 23న ఎన్నికల సంఘం ఆ పార్టీని గుర్తించింది. అదిమొదలు చాలాకాలం మౌనంగా ఉన్న షర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనదైన శైలిలో తిరగటం ప్రారంభించింది.

నాటినుండి వివిధ ప్రజాసమస్యలపైన పోరాటం చేస్తూ ప్రజలకు చేరువ అవడానికి ప్రయత్నించింది. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  దివంగత డా.వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులకు కొదవలేదు. వారంతా నేడు వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ వైఎస్‌ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. అలాంటవారందరినీ చేరదీయడం ద్వారా తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల అడుగుపెట్టింది. చాలామంది వైఎస్‌ఆర్‌ అభిమానులను ఆహ్వానించి సమావేశాలు నిర్వహించినప్పటికీ ఆ పార్టీలోకి నేటికీ బలమైన నాయకులెవరూ రాలేదు. ఇందిరా శోభన్‌, ఏపూరి సోమన్న, కొండ రాఘవరెడ్డి లాంటి కొందరు మాత్రం చేరారు. వీరిలో ఇప్పటికే కొందరు పార్టీని వదిలి వెళ్ళారు కూడా.  నిరుద్యోగం  లాంటి అనేక సమస్యలపై ధర్నాలు, నిరహార దీక్షలు  చేశారు. అన్నిటికన్నా మించి రాష్ట్రంలో మరే నాయకుడు చేయనంతగా సుదీర్ఘ పాదయాత్రచేసి రికార్డు సృష్టించింది. దాదాపు మూడువేల కిలోమీటర్లమేర సాగిన ఈ పాదయాత్రద్వారా రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలను చుట్టబెట్టింది. ఈ యాత్రల సందర్భంగా అధికార బిఆర్‌ఎస్‌నే కాకుండా కాంగ్రెస్‌, బిజెపి పార్టీలపైన కూడా విమర్షనాస్త్రాలను సంధించింది.

2013 చివర్లో జరుగనున్న ఎన్నికల్లో ఒంటరిగానే 119 స్థానాలకు పోటీచేయడానికి రంగం సిద్దంచేసుకుంది. కాని, ఒక్కసారే తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఆమె తీరు బిజెపితోనో, కాంగ్రెస్‌తోనో పొత్తుపెట్టుకుంటుందన్న ప్రచారానికి దారితీసింది. ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ కాంగ్రెస్‌ అగ్రనేతలతో పలు దఫాలుగా షర్మిల చర్చలు జరిపింది. అయితే విలీనమా, పొత్తా అన్న విషయంలో తర్జనబర్జనలు చోటు చేసుకున్నాయి. చివరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌  జోక్యంతో సోనియా, రాహుల్‌గాంధీతో జరిపిన సమాలోచనల ఫలితంగా  విలీనంవైపే షర్మిల మొగ్గు చూపించింది. పార్టీలో షర్మిలకు ప్రాధాన్యత ఇస్తామని సోనియా హామీ ఇవ్వడంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడినట్లైంది. అయితే  షర్మిల సోదరుడు ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్రంలో అధికారంలోఉన్న బిజెపి ప్రభుత్వానికి దగ్గర అవడంతో ఆమె సేవలను ఏపీలో వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇటు తెలంగాణలో అటు ఏపీలో కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోయిన విషయం తెలియందికాదు. అయితే తెలంగాణలో ఇటీవల పార్టీ బలపడుతున్నప్పటికీ ఏపీలో మాత్రం ఇంకా పైకి లేవలేకపోతున్నది. అక్కడ ప్రధాన ప్రతిపక్షాన్ని అధికార వైఎస్‌ఆర్‌ పార్టీ తొక్కివేస్తున్న దశలో కాంగ్రెస్‌ అభిమానులను సంఘటితంచేసి తిరిగి పూర్వపు స్థాయికి తీసుకువచ్చేందుకు షర్మిలను వాడుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం అభిప్రాయపడుతోంది. అయితే షర్మిల మాత్రం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతానంటోంది. విలీనంపైన చర్చలు జరుగడానికి ముందునుండీ తన వరకు తాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంనుండి పోటీచేసేందుకు సిద్దపడిరది. ఇప్పుడుకూడా తాను అదే స్థానంనుండి పోటీ చేస్తానన్న పట్టుదలతో ఉంది. కాని, కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం ఆమె అన్నకు ధీటుగా  పార్టీని బలోపేతం చేసేందుకు  ఏపీకే పరిమితం చేయాలను కుంటోంది. అందులో భాగంగా  కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే ప్రతిపాదనను కాంగ్రెస్‌ అధిష్టానం ఆమె ముందుంచింది. ఇక్కడ మరో విచిత్ర విషయమేమంటే ఎట్టి పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఆమె ప్రమేయాన్ని స్థానిక నేతలు ఇష్టపడడంలేదు. తమకిక్కడ ఆమె అవసరంలేదని కరాఖండీగా అధిష్టానానికి తేల్చిచెప్పారు.

దీంతో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపైన స్థబ్దత ఏర్పడిరది. ఒక పక్కన ఎన్నికల సమయం ముంచుకువొస్తున్నది. మరో పక్క కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్ధులను ఇవ్వాళ, రేపులో ప్రకటించే అవకాశం ఉంది. షర్మిల కావాలనుకుంటున్న పాలేరు నియోజకవర్గానికి ఇప్పటికే కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ ఉంది. అధికార బిఆర్‌ఎస్‌కు చెందిన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. వారిద్దరూ ఆశిస్తున్నది కూడా పాలేరు స్థానం కావడంతో, ఆమె కోరుకుంటున్న పాలేరు  స్థానం ఆమెకే లభించే అవకాశంలేదు.  ఆమెకే ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు అనుచరవర్గానికి టికెట్లు  ఎలా ఇప్పించుకోగలదన్న విమర్శకూడా లేకపోలేదు. ఒక పక్క కేంద్ర రమ్మంటోంది.. రాష్ట్రం వద్దంటోంది  అన్నపద్దతిలో ఆమె పరిస్థితి సందిగ్దంలో పడిరది. ఈ పరిస్థితిలో తమ పార్టీ భవిష్యత్‌పైన తాడోపేడో తేల్చుకునేందుకు షర్మిల సిద్ధపడిరది. అందులో భాగంగానే రాష్ట్రంలోని 33 జిల్లాలనుండి  ముఖ్యనేతలతో తాజాగా హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఏర్పాటుచేసిన  పార్టీ  సమావేశం ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి అల్టిమేటం ఇచ్చింది.

తన షరతులకు లోబడి ఈ నెల 30లోగా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించని పక్షంలో తనదారి తాను చూసుకుంటానని హెచ్చరించింది. ముఖ్యంగా తన పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపైన ఉండడంతో తానుకూడా పార్టీకి జవాబుదారిగా ఉండాల్సిఉందంటూ, విలీనంపై పూర్తి క్లారిటీ రాని పక్షంలో రాష్ట్రంలోని 119 స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమావేశంలో ఆమె ప్రకటించడాన్ని బట్టి కాంగ్రెస్‌ పార్టీ విలీనం విషయం ఇంకా చర్చనీయాంశంగానే ఉందన్నది స్పష్టమవుతున్నది.  అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమంటే  కాంగ్రెస్‌ పార్టీ తనకు  పూర్తి భరోసా ఇచ్చిందని,  పార్టీలో  ఏ స్థానం కల్పించినా తన క్యాడర్‌ను కాపాడుకుంటానని అనడంలోనే కాంగ్రెస్‌లో విలీనానికే ఆమె  ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతున్నది. అదే జరిగితే రాజన్న రాజ్యం నినాదం కాస్తా రాహుల్‌ రాజ్యంగా మారే అవకాశంలేకపోలేదు.
-మండువ రవీందర్‌రావు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page