- విచారణ నవంబర్ 20కి వాయిదా
- ఈ లోపు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి ఆదేశం
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 26 : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీమ్ కోర్టును ఆశ్రయించిన బిఆర్ఎస్ ఎంఎల్‌సి కవితకు ఊరట లభించింది. పిటిషన్‌పై విచారణను నవంబర్ 20కి వాయిదా వేస్తూ అప్పటి వరకు ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. అయితే మహిళ అయినంత మాత్రాన ఈడీ విచారణ వద్దనలేమని జస్టిస్ సంజయ్ కిషన్ ధర్మాసనం వ్యాఖానిస్తూ…మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీమ్ కోర్టు చెప్పేంత వరకు కవితకు నోటీసుల జారీ చేయమని ఈడీ బెంచ్‌కు తెలిపింది. ఇక దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ ఎదుట హజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు జేసిన విషయం తెలిసిందే.
అయితే ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సిఆర్సీకి విరుద్ధంమంటూ…ఈ సందర్భంగా నళినీ చిదంబరంను ఇంటివద్దే విచారణ చేపట్టిన విధంగా తననూ ఇంటివద్దే విచారణ జరుపాలని సుప్రీమ్ కోర్టులో ఆమె పిటషన్ వేసింది. తదనంతరం కూడా ఈడీ ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయగా తన పిటిషన్ సుప్రీమ్ కోర్టులో విచారణలో ఉండగా నోటీసులు ఎలా జారీ చేస్తారని ఈడీని ప్రశ్నిస్తూ తాను విచారణకు వొచ్చేది లేదని స్పష్టం చేసింది. దాంతో ఒకవేళ కవిత బిజీగా ఉంటే నోటీసులకు సంబంధించి పది రోజుల సమయం పొడిగిస్తామని తెలిపింది. ఈ క్రమంలో పది రోజుల సమయం ముగియడంతో మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కవిత పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్నందున తదుపరి విచారణ లోపు ఎలాంటి విచారణ చేపట్టవద్దని సుప్రీమ్ కోర్టు ధర్మాసనం ఈడీని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది.