- బిజెపి, కాంగ్రెస్ నేతలవి మాటలు…కేసీఆర్వి చేతలు
- సిద్ధిపేటలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హారీష్ రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్, 26 : సీఎం కేసీఆర్ బీసీలకు చేసే ఆర్థిక సాయం పథకాన్ని మోదీ కాపీ కొట్టారని రాష్ట్ర మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ మాటలు చెప్పేవాళ్లయితే..చేతల్లో చూపేది సీఎం కేసీఆర్ అని, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీష్ స్పష్టం చేశారు. 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి, ఇప్పుడు చేస్తామని బాండ్ పేపర్లు రాసిస్తున్నారని, కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీగా మంత్రి చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ పాల్గొన్నారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ….వారంలోపు రజకుల పంక్షన్ హాల్ కోసం స్థలం అప్పగిస్తానని హామీనిచ్చారు. సిద్ధిపేట ఓపెన్ ఏయిర్ ఆడిటోరియంకు చాకలి ఐలమ్మ ఆడిటోరియంగా నామకరణం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఐలమ్మ అంటేనే ఉద్యమ స్ఫూర్తి అని, పేదల పక్షాన పోరాడిన వీర వనిత అని, ఆమె పోరాటంతో ఎంతో మందిని కాపాడిందన్నారు.
ఐలమ్మ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పోరాడటం వల్లనే రాష్ట్రం వొచ్చిందన్నారు. రాష్ట్రం వొచ్చాక ఎంతో మంది ఉద్యమకారులను గుర్తించి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రజకులను పట్టించుకోలేదని, జిల్లా వ్యాప్తంగా 500 మంది రజకులకు ఆర్థిక సహాయం అందించామన్నారు. రైతులకు ఇచ్చే రైతు బంధు, మిషన్ భగీరథ పథకాలు మోదీ కాపీ కొట్టారని, అయినా దేశంలో ఇప్పటికే 30 శాతం మందికి నీళ్ళు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్సి సారయ్య మాట్లాడుతూ..రజకులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇలా ఉచిత కరెంట్ ఇవ్వడం లేదన్నారు. పట్టుదల గల నాయకుడు మంత్రి హరీష్ అని అన్నారు. రైతాంగ పోరాటానికి, సమాజ బాగు కోసం కృషి చేసిన వ్యక్తి చాకలి ఐలమ్మ అన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావును లక్షన్నర మెజారిటీతో గెలిపించాలని రజకులకు విజ్ఞప్తి చేశారు.