కేసీఆర్ ఉద్యమంతోనే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది
అభివృద్ధి అంటే మురికి కాలువలు, సిసి రోడ్లు నిర్మించడం కాదు
అభివృద్ధి అంటే జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను మార్చడమని
గడిచిన తొమ్మిదేళ్లలో నిరూపించం
సిద్ధిపేట తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: తెలంగాణ యాస, భాషలను చిన్న చూపు చూడడంతో ఆంధ్రప్రదేశ్ ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదనీ, అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడిరదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలికొదిలేసింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లో దారుణమైన వివక్ష అమలైందనీ, ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చిందన్నారు. ఈ క్రమంలో 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమశంఖం పూరించి తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, పధ్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించి లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెల్లడం వల్ల తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢల్లీి ప్రభుత్వం దిగివచ్చిందనీ, దాంతో 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు.