‌ప్రచార వ్యూహంలో బిజెపి

  • ఏకబిగిన 19 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర
  • ధికారికంగా 17న విమోచన దినం…పార్టీపరంగా అమిత్‌ ‌షాతో భారీ బహిరంగ సభ
  • పదాధికారుల సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చ

రానున్న ఎన్నికలకు రాష్ట్ర బిజెపి సిద్దమవుతున్నది. వాస్తవంగా రెండు మూడు సంవత్సరాలుగా తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా బిజెపి కార్యక్రమాలు రూపొందిస్తున్నప్పటికీ, ఎన్నికలు సమీపించడంతో భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. శుక్రవారం సాయంత్రం వరకు జరిగిన ఆ పార్టీ పదాధికారుల సమావేశంలో పార్టీ ముఖ్యనేతలతో అనేక విషయాలపైన సుదీర్ఘ చర్చలు జరిపింది. ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలను ఎలా ఎదుర్కునాలి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి తదితర అంశాలపైన సుదీర్ఘ చర్చ జరిపింది. ఈ సమావేశంలో బిజేపి కేంద్ర సీనియర్‌ ‌నాయకులు ప్రకాశ్‌ ‌జయదేవకర్‌, ‌సునీల్‌ ‌బన్సల్‌ ‌లాంటివారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ, కాంగ్రెస్‌ ‌పార్టీకి ధీటుగా ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది. ఏకబిగిన పందొమ్మిది రోజుల పాటు బస్సు యాత్రను చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ నెల 26న ప్రారంభించి వొచ్చే నెల 14వ తేదీవరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రను నిర్వహించే ప్రణాళికను రూపొందించింది. ఈ పందొమ్మిది రోజుల్లో దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రజలను కలుసుకునే విధంగా రూట్‌ ‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుంది.

గతంలో పార్టీ అధ్యక్షుడు ఒక్కడే బస్సు యాత్రనో, పాదయాత్రనో చేయడం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సత్వరం తిరిగే పరిస్థితి లేకపోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్రధానంగా బస్సు యాత్రను మూడు జోన్లుగా  చేపట్టాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ మూడు రూట్లలో పయనించేప్పుడు ఆయా ప్రాంతాల్లోని నాయకులు దాని సారథ్యం వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. దానివల్ల పార్టీలోని ప్రధాన నాయకులకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని కల్పించినట్లు అవుతుందని సమావేశం భావించింది. కొమురం భీంను ఒకటవ జోన్‌గా నామకరణం చేసింది. ఈ జోన్‌ ‌పరిధిలో ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌మెదక్‌, ‌బాసర జిల్లాలుంటాయి. కృష్ణా జోన్‌ 2‌గా పేర్కొంటున్న దాని పరిధిలో మహబూబ్‌ ‌నగర్‌, ‌నల్లగొండ, జిల్లాలుంటాయి. అలాగే మూడవ జోన్‌కు గోదావరి జోన్‌గా నామకరణం చేశారు.  దీని పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్‌, ‌కరీంనగర్‌లుంటాయి.  మొదటి జోన్‌ ‌యాత్ర బాసర నుండి ప్రారంభ మవుతుంది. దీనికి బండి సంజయ్‌ ‌నాయకత్వం వహించే అవకాశం ఉంది.

అలాగే సోమశిల నుండి ప్రారంభమయ్యే రెండవ జోన్‌కు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సారథ•థ్యం వహించే అవకాశముంది. ఇక మూడవ జోన్‌కు హుజురాబాద్‌ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌నేతృత్వం వహించనున్నారు. ఈ మూడు జోన్ల యాత్రలు చివరి రోజున అనగా సెప్టెంబర్‌ 17‌న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరుకునే విధంగా కార్యక్రమాన్ని సిద్ధం చేయాలని నిశ్చయించింది. అంతేగాక ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకుని ఆరోజు మొదలు అక్టోబర్‌ 2‌వ తేదీవరకు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను చేపట్టాలని కూడా నిర్ణయించింది. దీనితోపాటు తెలంగాణ విమోచన దినాన్ని కూడా అత్యంత భారీ స్థాయిలో చేపట్టేందుకు సన్నాహాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినాన్ని జరిపినట్లుగానే ఈ సారి కూడా కేంద్రం ఆధ్వర్యంలోనే కార్యక్రమాన్ని కొనసాగించాలని నిశ్చయించింది.

అయితే ఆ రోజున కేంద్ర మంత్రులు ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షాను తీసుకువచ్చి భారీ స్థాయిలో బహిరం సభను నిర్వహించేందుకు ఇంతకు ముందు నుండే ఏర్పాట్లు చేస్తుంది. అందుకు సికింద్రాబాద్‌లోని పోలీస్‌ ‌పర్యడ్‌ ‌గ్రౌండ్‌ను ఇప్పటికే ఎంపిక చేసుకుని ఏర్పాట్లు చేస్తుంది. ఆ రోజును ప్రత్యేక రోజుగా పార్టీ భావించబోతున్నది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులను అదే రోజున ప్రకటించాలని కూడా పార్టీ అభిప్రాయపడుతున్నది. అభ్యర్ధుల ప్రకటనతో ఎన్నికలకు శంఖారావాన్ని పూరించినట్లు అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అనంతరం మరో సారి ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణకు తీసుకురావడం ద్వారా పార్టీ వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపాలని పార్టీ యోచిస్తుంది. ఇదిలా ఉంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో భారీ స్థాయిలో బహిరంగ సభలను నిర్వహించాలని కూడా నిర్ణయించింది. వీటి నిర్వహణకుగాను 20 కమిటీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద బిజెపి ఈ పదాధికారుల సమావేశంతో దూకుడు పెంచిందనే చెప్పాలె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page