99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ..ఉత్తర్వులు జారీ.. బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ ..ప్రకటన విడుదల చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న శుభసందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది.ప్రకటన లో …రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను.. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు రుణ మాఫీ పథకాన్ని ఆచరణలో పెట్టారు. రూ.లక్ష లోపు రుణాలను తీసుకున్న రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఈమేరకు ఈ రోజు 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కు సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 9లక్షల2వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇవి రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరుతాయి. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చిన విషయం తెల్సిందే. ఎన్నికల హామీలలో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి సమగ్ర వివరాలు తెప్పించుకున్నారు. ఇదంతా జరగడానికి ఒక ఏడాది సమయం పట్టింది. అయితే, అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా కొరోనా విజృంభించడం, లాక్ డౌన్ ఉండడం, మన దేశంలో నోట్ల రద్దు పర్యవసానాలతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒడిదొడుకులకు గురికావడంతో ప్రభుత్వానికి వనరులు సమకూరడంలో ఇబ్బంది ఏర్పడింది. అయినప్పటికీ ఇప్పటికే 50వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతులకు సంబంధించి 1943 కోట్ల 64 లక్షల రూపాయలను బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తాన్ని రైతురుణమాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. ఇక మిగిలిన మొత్తం కూడా మాఫీ చేయడానికి నిధులు సమకూర్చుకున్నది. తాజాగా 99వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు అప్పున్న రైతుల రుణాల మాఫీకి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగం, రైతు రుణమాఫీ గురించి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి రైతు రుణమాఫీని అతి త్వరలోనే సంపూర్ణంగా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 45 రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆగస్టు 3వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ రీలిజింగ్ ఆర్డర్ (బీఆర్ వో) కూడా ఇచ్చారు. ఈమేరకు ఆగస్ట్ 3వ తేదీ నుంచి రుణమాఫీకి సంబంధించిన నిధుల విడుదల మొదలయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రుణమాఫీకి సంబంధించి.. ఇచ్చిన మాట ప్రకారం, 99వేల 999 రూపాయల వరకు ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేయాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తంగా 16లక్షల 66వేల 899 మంది రైతులకు లబ్దిచేకూరినట్లవుతుంది అని పేర్కొన్నారు.