కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం 76 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా తో కలిసి జిల్లా కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక,వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరై జాతీయ పతాకావిష్కరణగావించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. మంత్రి తోపాటు స్వాతంత్ర సమరయోధులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు విద్యార్థులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా షామియానా, త్రాగునీరు ఏర్పాటు చేయాలని, స్వాతంత్ర సమరయోధులను సన్మానించేందుకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కళ్లకు కట్టిపడేలా స్టేజి డెకరేషన్ చేయాలని, సౌండ్ సిస్టం ముందస్తుగా సిద్ధం చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని, పోలీస్ శాఖ పెరేడ్ కు సిద్ధం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో రమేష్, ఏసిపి కే. సురేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ మహేష్, డిపిఆర్ఓ రవికుమార్, సమాచారశాఖ డిఇ తిరుపతి నాయక్, సిద్దిపేట అర్బన్ తాసిల్దార్ దిలీప్, పోలీస్, మున్సిపల్, ఆర్&బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.