ఆప్ విద్యార్ధి విభాగం నేతల అక్రమ అరెస్ట్ ఖండిస్తున్నాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : నిర్మల్ ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో వరుస విద్యార్థుల ఆత్మహత్య ఘటనలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధి జాదవ్ బబ్లు కుటుంబానికి న్యాయం చేయాలనీ, విద్యార్థులు ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిర్మల్ ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగిన ఆప్ విద్యార్ధి విభాగం నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో డాక్టర్ దిడ్డి సుధాకర్ తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆప్ విద్యార్ధి విభాగం నేతలను విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. వరుసగా విద్యార్థులు ఉరి వేసుకుని తనువు చాలించడం, మొన్న ఇంజనీరింగ్ విద్యార్ధి జాదవ్ బబ్లు హాస్టల్ గదిలో ఉరివేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందడం అందరికీ ఆందోళనకు గురి చేస్తున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేసారు. విద్య సంస్థలు మృత్యు కేంద్రాలుగా మారుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని అయన మండిపడ్డారు. నిర్మల్ ట్రిపుల్‌ ఐటీలో కౌన్సిలింగ్‌ చర్యలు పెద్దప్రభావం చూపించడం లేదని తెలిసికూడా ప్రభుత్వం విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని అయన ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలు ఒక సంక్షోభమని ప్రభుత్వం గుర్తించి, సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని, విద్య ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ను ప్రసాదించే బాధ్యత ప్రభుత్వానిదేనని అయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలు నివారణకు చెర్యలు చేపట్టాలని లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page