ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలను వెంటనే జరిపించాలని మంత్రి హరీష్ రావును మహిళా ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమై వేడుకున్నారు. 13 జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో హరీష్ రావును కలిసినట్లు తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం అధ్యక్షులు ఎస్.వివేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 నెలలుగా కుటుంబాలకు దూరమై నరకయాతన అనుభవిస్తున్నామని, బదిలీలు నిర్వహించి తమకు విముక్తి కల్పించాలని మహిళా ఉపాధ్యాయులు రోదనల మధ్య, నమస్కారాలతో మంత్రిని వేడుకున్నారు. శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్నామని ఈ బాధలు ఇంకా భరించలేమన్నారు. తమ కుటుంబాలు శోకసముద్రంలో ఉన్నాయని దయచేసి సమస్య పరిష్కరించమని అభ్యర్థించారు. కన్నీటి పర్యంతమైన మహిళా ఉపాధ్యాయులు స్పౌజ్ బదిలీలను వెంటనే జరపమని మంత్రి హరీష్ రావును అభ్యర్థించడానికి 13 జిల్లాల నుంచి బాధితులు మంత్రి క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. వీరిలో ఎక్కువమంది మహిళా ఉపాధ్యాయులే ఉన్నారు. గడిచిన 19 నెలలుగా అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నామని వారు వాపోయారు. కుటుంబాలకు దూరంగా చెప్పనలవి గాని దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుందని మంత్రికి వివరిస్తూ మహిళ ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్య పరిష్కరించాలని నమస్కారం చేస్తూ మంత్రిని అభ్యర్థించడం అందరి మనసులను కలచివేసింది. మానవతా దృక్పథంతో తమపైన జాలి చూపమని తన సమస్యను పరిష్కరించమని మంత్రిని వేడుకున్నారు.