మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 10: స్వతంత్ర అమృత మహోత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 13 నుంచి 16 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను మహేశ్వరం నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బీజేపీ ఏంఏంసి అధ్యక్షుడు, కార్పొరేటర్ పెండ్యాల నర్సింహతో కలిసి మీర్ పేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర అమృత మహోత్సవాల ముగింపు వేడుకలను మహేశ్వరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం చెప్పారు. పాఠశాలలో పార్కులు వివిధ స్థలాల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల శిలాఫలకాలు ఏర్పాటుతో పాటు అంగవైకల్యం కలిగిన వారికి సన్మానం చేయడమే కాకుండా ప్రతి దగ్గర 75 మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ఇదే సమయంలో పంచ ప్రాణాల ప్రతిజ్ఞ చేయనున్నట్లు చెప్పారు. హర్ ఘార్ తిరంగాలో భాగంగా.. కులాలు, మతాలకు అతీతంగా 13 నుంచి 16 ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి, ప్రతి ఒక్కరం దేశ భక్తిని చాటుకుందామని పిలుపునిచ్చారు. మేరీ మాటి-మేరా దేశ్ కార్యక్రమంలో ప్రతి గ్రామము, వార్డు, డివిజన్ లోని ఆలయాలు, పూజ మందిరాలు వంటి పవిత్ర ప్రదేశాల నుంచి మట్టిని సేకరించి, దానిని మండలంలోని ఒక అమృత కలశంలో ఉంచాలి. ఇలా 7500 అమృత కలశాలను ఢిల్లీ లోని కర్తవ్య పాథానికి పంపనున్నట్లు శంకర్ రెడ్డి తెలిపారు. అమృత మహోత్సవాల ముగింపు కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కీసర గోవర్ధన్ రెడ్డి, సుల ప్రభాకర్, సోమేశ్వర్, నాగరాజు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.