ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 8 : కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండల కేంద్రంలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు గత ప్రభుత్వాలు ఇండ్ల పట్టాలు ఇచ్చి 27 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వారికి స్థలం ( పొజిషన్) చూపించకపోవడంతో సోమవారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజి ఆచారి ఆధ్వర్యంలో మండల బిజెపి నాయకులు తలకొండపల్లి తాహ సిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా నుద్దేశించి ఆచారి మాట్లాడుతూ సర్వే నెంబర్ 6, 7 లో అప్పటి ప్రభుత్వం 180 మంది లబ్ధిదారులకు ఆరు ఎకరాల స్థలంలో ఇండ్ల పట్టాలను మంజూరు చేసింది.. ఇండ్ల పట్టాలు ఇచ్చి 27 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వారికి పొజిషన్ చూపించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. వారికి న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి నలుగురు ఎమ్మెల్యేలు మారిన ఇంతవరకు లబ్ధిదారు ఇల్లు నిర్మించకపోవడం శోచనీయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రజా ప్రతినిధులు వీరి గోస ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. 1999లో 180 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టాలిచ్చి ఒకరి పేరున రెండు పట్టాలి ఇచ్చి 180 లబ్ధిదారుల నుంచి 280 లబ్ధిదారులు చేశారని ఆయన ఆరోపించారు. మొదట విడతలో ఇచ్చిన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇరువురి మధ్య కొట్లాటలు పెట్టి ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇండ్ల పట్టాదారులకు న్యాయం చేయలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో లబ్ధిదారులకు న్యాయం చేయకుంటే ఆ స్థలాన్ని ఆక్రమించి లబ్ధిదారులకు తామే గుడిసెలు వేయిస్తామన్నారు. ఇండ్ల పట్టా లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకూ ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పట్టాలిచ్చి పొజిషన్ చూపించకపోవడంతో ఆ స్థలం అన్యక్రాంతమవుతుందని దాదాపుగా అందులో మహిళా సమైక్య భవనం, కస్తూర్బా గాంధీ పాఠశాలను నిర్మించారని వెంటనే లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రజా ప్రతినిధులు నాయకులు శేఖర్ రెడ్డి, హేమ రాజు, అనిల్, నరసింహ, చెన్నకేశవులు, కుమార్, రెడ్డి నాయక్, పాండు, కమలేష్, మహేష్, సాయి లాల్ నాయక్, తదితరుల పాల్గొన్నారు.